ప్రపంచంలో ఎక్కడా జరగని వింత దొంగతనాలు (crime news) బిహార్లో చోటుచేకుంటూ ఉంటాయి. రైలు ఇంజను ఎత్తుకెళ్లారని, ఇనుప బ్రిడ్జిని దొంగలు కాజేసిన వార్తలు, చివరకు కంకర రోడ్లను కూడా దొంగిలించిన ఘటనలు బిహార్లో అనేకం. వీటిని తలదన్నేలా ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. బిహార్లోని దర్భాంగాలో భూముల ధరలు పెరగడంతో రాత్రి రాత్రి ఓ దొంగ చెరువును కాజేశాడు. తెల్లారేసరికే చెరువును మట్టితో నింపేసి గుడిసెలు వేశాడు. స్థానికులు నిద్ర నుంచి లేచేసరికే చెరువు కనిపించకుండా పోయింది.దీంతో చెరువు కనిపించడం లేదంటూ పోలీసు కేసు పెట్టారు.
గతంలోనూ దర్భాంగాలో చెరువును కబ్జా చేసేందుకు చాలా మంది ప్రయత్నించారు. అయితే స్థానికులు అడ్డుకోవడంతో అప్పటికి దుండగులు వారి ప్రయత్నాలు విరమించుకున్నారు. తాజాగా మరో దొంగ అర్థరాత్రి ట్రాక్టర్లతో మట్టితోలి చెరువు మొత్తం పూడ్చి వేశాడు. వెంటనే గుడిసె వేసి బోర్డు పెట్టేశాడు. దీంతో స్థానికులు అవాక్కయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకునేలోపే దుండగుడు పరారయ్యాడని స్థానికులు తెలిపారు.