విశాఖలో అరాచకం వెలుగులోకి వచ్చింది. ఓ దళిత బాలికపై కామాంధులు విరుచుకుపడ్డారు. మృగాళ్ల చేతిలో బాలిక నరకం అనుభవించింది. ఒడిశా నుంచి కూలీ పనుల కోసం విశాఖ వచ్చిన 17 సంవత్సరాల బాలికను 10 మంది యువకులు గ్యాంగ్ రేప్ (vizag gang rape) చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా వైరల్ అయింది. ప్రేమ పేరుతో చేరదీసిన యువకుడు ముందుగా కామవాంఛ తీర్చుకున్నాడు. తరవాత అతని స్నేహితుడిని ఉలిగొలిపాడు. ఇలా మొత్తం పది మంది మృగాళ్లు బాలికపై గ్యాంగ్ రేప్ చేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం. ఒడిశాకు చెందిన ఓ కుటుంబం కూలీ పనుల కోసం విశాఖలోని కంచరపాలెంలో నివసిస్తోంది. 17 సంవత్సరాల బాలిక రైల్వే కాలనీలో కుక్కలకు పోషించే పనిలో కుదిరింది. అక్కడే ఉండే భువనేశ్వర్ ప్రాంతానికి చెందిన యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. గత నెల 18న బాలికకు మాయమాటలు చెప్పి నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తరవాత స్నేహితుడిని పిలిచి, బాలికపైకి ఉసిగొలిపాడని పోలీసులు తెలిపారు.
మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకునేందుకు బీచ్‌కు వెళుతుండగా మరికొందరు యువకులు ఆమెను జగదాంబ కూడలి వద్ద లాడ్జికి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులు తెలిపారు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి చేరుకుంది. రెండు వారాలు బాధను అనుభవించిన బాలిక, చివరకు విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటికే 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.