ఎర్ర సముద్రం ఎరుపెక్కింది. గత కొంత కాలంగా ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తోన్న నౌకలపై హౌతీలు దాడులకు తెగబడుతన్న సంగతి తెలిసింది. హౌతీ తిరుగుబాటుదారులను అణచివేసేందుకు అమెరికా సైన్యం రంగంలోకి దిగింది. తాజాగా హౌతీలకు చెందిన మూడు బోట్లను అమెరికా సైన్యం సముద్రంలో ముంచేసింది. ఈ ఘటనలో 10 మంది హౌతీ తిరుగుబాటుదారులు చనిపోయారని తెలుస్తోంది.
తాజాగా డెన్మార్క్ షిప్పింగ్ సంస్థ మెర్స్ హంగ్ జై రవాణా నౌకను హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్ చేసే ప్రయత్నాలు చేశారు. నాలుగు బోట్లలో హంగ్ జైకు సమీపానికి చేరుకున్నారు. మెర్స్ సిబ్బంది పంపిన సమాచారంతో అమెరికా సైన్యం హెలికాఫ్టర్లతో రంగంలోకి దిగింది. హౌతీలపై కాల్పులు జరిపి, మూడు బోట్లు ముంచివేసినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. మరో బోటులోని హౌతీలు తప్పించుకు పోయారని తెలిపారు. రెండు రోజులపాటు కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు మెర్స్ ప్రకటించింది.
మెర్స్ రవాణా నౌకపై హౌతీలు ముందుగా క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా చర్యలపై హౌతీ దేశం తీవ్రంగా స్పందించింది. ఎర్రసముద్రంలో ఎవరు జోక్యం చేసుకున్నా తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించింది.