నూతన సంవత్సరంలో ఇస్రో (ISRO C-58) మరో మైలు రాయిని అందుకుంది. ఇవాళ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు ఇస్రో ప్రయోగించిన వాహకనౌక ఎక్స్ రే పోలారిమీటర్ ఉపగ్రహం పీఎస్ఎల్వీ సీ-58 నింగిలోకి దూసుకెళ్లింది. నిన్న ఉదయం ప్రారంభమైన కౌంట్ డౌన్ ఇవాళ ముగిసింది. పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు.
పీఎస్ఎల్వీ సీ-58 వాహక నౌక ద్వారా 480 కిలోల ఎక్స్పీఓ శాట్‌ను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపారు. ప్రయోగం పూర్తైన తరవాత ఎక్స్ పో శాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంటుంది. కేరళ విద్యార్థులు తయారు చేసిన ఓ చిన్న శాటిలైట్‌ను కూడా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. తాజాగా ప్రయోగించిన ఉపగ్రహం ద్వారా ఖగోళశాస్త్రంలో అంతుచిక్కని రహస్యాలను కనుగొనే అవకాశాలున్నాయి. ఇమేజింగ్, టైం డొమైన్ అధ్యయనాలు, స్పైక్ట్రోస్కాపీపై ప్రధానంగా ప్రయోగాలు జరగనున్నాయి.
ఎక్స్ పో శాట్ ఐదేళ్లు పనిచేస్తుంది. కృష్ణబిలాలపై పరిశోధనలకు ఉపయోగపడుతుంది. ఎక్స్‌రే ఫోటాన్లు, పొలరైజేషన్‌పై అధ్యయనం ద్వారా కృష్ణబిలాలు, న్యూట్రాన్ స్టార్ల దగ్గర రేడియేషన్‌పై పరిశోధనకు ఉపయోగపడుతుంది.