దేశంలో
సైబర్ నేరగాళ్ళ అరాచకాలు రోజురోజుకు పెచ్చురిల్లుతున్నాయి. సెలబ్రిటీలను
బురిడీకొట్టించిన సైబర్ దొంగలు రోజుకో అవతారం ఎత్తుతున్నారు. దేశంలో జరిగే సాంస్కృతిక,
ఆద్మాత్మిక కార్యక్రమాల పేరు చెప్పి దోపిడీకి పాల్పడటం సైబర్ దొంగలు ఫాలో అవుతున్న
నయాట్రెండ్.
అయోధ్య
రాముడు, ప్రముఖ హిందూ సంఘాల పేర్లు చెప్పి భక్తులను నిలువునా దోచుకుంటున్నారు.
ఉత్తరప్రదేశ్, దిల్లీలో శ్రీరాముడి పేరిట సైబర్ నేరగాళ్ళు చేస్తోన్న దోపిడీపై
పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సైబర్
నేరాల పట్ల ప్రజలంతా జాగురూకతతో ఉండాలంటూ బ్యాంకులు, పోలీసులు ఎంత ప్రచారం చేసినా
దేశంలో రోజు వందల సంఖ్యలో డిజిటల్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
శ్రీరాముడి
జన్మస్థలిలో భవ్యరామమందిర నిర్మాణ పనులకు తుదిదశకు చేరుకోవడంతో అక్కడ బాలరాముడి
విగ్రహ ప్రతిష్టకు రంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఆద్మాత్మిక సౌరభాలు
దేశమంతా వ్యాపించాయి. రాముడి స్మరణతో దేశం మార్మోగుతున్న వేళ, ఆయన పేరు చెప్పి
సైబర్ కేటుగాళ్ళు భక్తుల ధనం కాజేస్తున్నారు.
శ్రీరామ
జన్మభూమి తీర్థ్ క్షేత్ర న్యాస్, సహా ఇతర హిందూ సంఘాల పేరిట క్యూఆర్ కోడ్ స్కానర్
తో ప్రజల వద్దకు వెళ్ళి విరాళాలు వసూలు
చేస్తున్నారు. ఫలానా మొత్తం దేవుడికి అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ
విషయాన్ని విశ్వహిందూ పరిషత్ అధికార ప్రతినిధి బన్సాల్ ఖండించారు. శ్రీరాముడి భవ్య
రామమందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు ఎవరినీ అధికారికంగా నియమించలేదని
స్పష్టం చేశారు. ఈ తరహా మోసాలపై చర్యలు
తీసుకోవాలని, దిల్లీ, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు
తెలిపారు.
రామమందిర
నిర్మాణం తుదిదశకు చేరుకోవడంపై దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.
మొబైళ్ళకు లింకులు పంపి వాటి ద్వారా విరాళాలు
కోరుతున్నారు. తాము అయోధ్య నుంచి ఫోన్ చేస్తున్నామని రామమందిర నిర్మాణంతో ఇతర
హిందూ దేవాలయాల కోసం విరాళాలు సేకరిస్తున్నట్లు చెబుతున్నారు.