ప్రధాని నరేంద్ర మోదీ (pm modi man ki baat) దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023లో చివరి సారి మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ఈ ఏడాది వికసిత్ భారత్ స్ఫూర్తి రగిలిందన్నారు. కొత్త సంవత్సరంలో కూడా కొనసాగించాలని కోరారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ ఏడాది సాధించిన విజయాలను ఆయన గుర్తుచేశారు.
మూడు దశాబ్దాలుగా దేశ ప్రజలు ఎదురు చూస్తోన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు 2023లో ఆమోదం లభించింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ ఏడాది ఆవిర్భవించిందని ప్రధాని గుర్తుచేశారు. జీ 20 సదస్సు విజయవంతంగా నిర్వహించడంపై కూడా మోదీ ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది భారతీయులు ప్రపంచ వేదికపై ప్రతిభ చూపారని కొనియాడారు.
ఆసియా క్రీడల్లో మన ఆటగాళ్లు 107 పతకాలు, పారా గేమ్స్‌లో 111 పతకాలు సాధించడంపై ప్రధాని మోదీ మరోసారి వారికి ధన్యవాదాలు తెలిపారు. భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడం దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం నింపిందని తెలిపారు.అయోధ్యలో రామాలయం కల సాకారం కాబోతోందని గుర్తుచేశారు.