China support to Pak
terrorists
త్వరలో జరగనున్న పాకిస్తాన్ ఎన్నికల్లో హఫీజ్
తల్హా సయీద్ (Hafiz Talha Sayeed) అనే వ్యక్తి లాహోర్ నుంచి పోటీ చేస్తున్నాడు. అతను భారతదేశానికి మోస్ట్
వాంటెడ్ టెర్రరిస్ట్ అయిన హఫీజ్ సయీద్ (Hafeez
Sayeed) కొడుకు. తల్హా సయీద్‌ను భారతదేశం 2022 ఏప్రిల్ 8న
ఉగ్రవాదిగా ప్రకటించింది. అతన్ని బ్లాక్‌లిస్ట్ చేయాలంటూ 2022 అక్టోబర్ 19న ఐక్యరాజ్యసమితి
భద్రతా మండలి ముందు ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనకు అడ్డం కొట్టింది ఎవరో
తెలుసా… చైనా. ఐక్యరాజ్యసమితిలో తనకున్న వీటో అధికారాన్ని ప్రయోగించి చైనా భారతదేశ
వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. (China supporting Pak Terrorists)
భారతదేశానికి వ్యతిరేకంగా వ్యహరించే
పాకిస్తాన్‌కు అడుగడుగునా సహకరిస్తూ, పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశంలో విధ్వంసం
సృష్టించడానికి తోడ్పడుతూ, వారిని నిలువరించేందుకు ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసే
ప్రయత్నాలకు గండికొడుతూ…. చైనా మన దేశానికి కలగజేస్తున్న నష్టం అంతా ఇంతా కాదు. అలాంటి
ఘటనల కాలక్రమాన్ని, చైనా రక్షించిన పాకిస్తానీ ఉగ్రవాదుల కథనూ ఒక్కసారి చూద్దాం.
13-03-2009: ముంబైపై 26/11 దాడుల తర్వాత
భారతదేశం జైషే మహమ్మద్ (Jaish-e-Mohammad)
సంస్థ చీఫ్ మసూద్ అజార్‌ను (Masood Azhar) ఉగ్రవాదుల జాబితాలో చేర్చాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనను చైనా
వ్యతిరేకించి నిలువరించింది.
డిసెంబర్ 2010: ముంబైపై దాడుల సూత్రధారి
హఫీజ్ సయీద్ (Hafeez Sayeed), ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దావాలపై (Jamat-Ud-Dawa) ఆంక్షలు విధించాలన్న భారత ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో
చైనా నిలిపివేసింది. హిజ్బుల్ ముజాహిదీన్ (Hizbul Mujahideen) చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌ను (Syed Salahuddin) భద్రతామండలి ఉగ్రవాదిగా గుర్తించేలా చేయడానికి భారతదేశపు ప్రయత్నాలను
చైనా అడ్డుకుంది.
12-04-2016: పఠాన్‌కోట్ దాడి సూత్రధారి,
పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ చీఫ్ మసూద్
అజార్, ‘మిత్రదేశం’ చైనాను ప్రశంసించాడు. తనను అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో
చేర్చడానికి ఐక్యరాజ్యసమితిలో భారత్ చేసిన ప్రయత్నాలను మొగ్గలో తుంపేసిన చైనాను
అభినందించాడు.
02-11-2017: మసూద్ అజార్‌పై భద్రతామండలి
ఆంక్షలు విధించాలన్న భారత ప్రతిపాదనను చైనా నిలువరించడం హ్రస్వదృష్టితో, పక్షపాత
ధోరణితో కూడుకున్న నిర్ణయమని భారత్ ఆగ్రహం
వ్యక్తం చేసింది.
13-03-2019: పుల్వామా ఉగ్రవాద దాడి (Pulwama Attack) తర్వాత, మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ భద్రతామండలిలో
మరోసారి ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చకుండా ఈసారి కూడా చైనాయే
మోకాలడ్డింది.
17-06-2022: అబ్దుల్ రెహమాన్ మక్కీ (Abdul Rehaman Makki) అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నేరస్తుడు. ముంబై ఉగ్రదాడులు,
2000లో ఢిల్లీలో ఎర్రకోటపై దాడి, జమ్మూకశ్మీర్‌లో పలు దాడుల్లో మక్కీ ప్రమేయం
ఉంది. అతన్ని భద్రతామండలి ఉగ్రవాదిగా గుర్తించాలని భారత్ చేసిన ప్రతిపాదనను యధావిధిగా
చైనా అడ్డుకుంది.
12-08-2022: అబ్దుల్ రవూఫ్ అజార్ (Abdul Rauf Azhar) నిషిద్ధ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ టాప్ కమాండర్. 1999 కాందహార్‌లో
భారతదేశ విమానపు హైజాక్, 2001 భారత పార్లమెంటుపై దాడి, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై
దాడి వంటి ఘటనల్లో కీలక పాత్రధారి. అతనిపై ఆంక్షలు విధించాలన్న భారత ప్రతిపాదనకు
భద్రతామండలిలో మిగతా 14 సభ్యదేశాలూ ఒప్పుకున్నాయి. కానీ చైనా ఆ ఉగ్రవాదికి మద్దతు పలికింది.
అతనిపై ఆంక్షలు విధించకుండా అడ్డుకుంది.
17-09-2022: పాకిస్తాన్ కేంద్రంగా
పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తయ్యబాలో (Lashkar-e-Taiba) సుశిక్షితుడైన
ఉగ్రవాది సాజిద్ మీర్ (Sajid Mir). భారత్ అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. 26-11-2008
నాటి ముంబైపై ఉగ్రదాడుల్లో ప్రధాన పాత్రధారి. అతన్ని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చాలని
భారతదేశం, అమెరికా ప్రతిపాదించాయి. చైనా ఆ ప్రతిపాదనను వీటో చేసింది.
19-10-2022: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే
ఉగ్రవాద సంస్థ లష్కర్-ఎ-తయ్యబాకు చెందిన షాహిద్ మహమూద్‌ను (Shahid Mahmood) అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్, అమెరికా దేశాలు
ఐక్యరాజ్యసమితిని కోరాయి. ఆ రెండు దేశాల పైనా దాడులు చేయడమే లష్కర్ ప్రాథమిక లక్ష్యమని
షాహిద్ మహమూద్ 2016లో బహిరంగంగానే ప్రకటించాడు. అయినా, చైనా అతన్ని వెనకేసుకు వచ్చింది.
20-06-2023: ముంబైపై ఉగ్రవాద దాడిలో
ప్రమేయమున్న ఉగ్రవాది సాజిద్ మీర్, లష్కర్-ఎ-తయ్యబా సభ్యుడు. భారత్ అతన్ని మోస్ట్
వాంటెడ్ టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి
ప్రకటించాలని భారత్, అమెరికాలు ప్రతిపాదించాయి. యధావిధిగా చైనా ఆ ప్రతిపాదనకు
అడ్డం పడింది.
ఐక్యరాజ్యసమితిలో ఇతర దేశాల మద్దతు భారత్‌కు
లభించినప్పటికీ, మన దేశంపై దాడులకు పాల్పడిన పాకిస్తానీ ఉగ్రవాదులను పట్టుకోడానికి
భారత్ చేసిన ప్రతీ ప్రయత్నానికీ చైనా భద్రతామండలిలోనే అడ్డుపడింది. దానికి కారణాలు
భారత్‌పై చైనాకున్న అకారణ ద్వేషం, పాకిస్తాన్‌పై ఉన్న అవ్యాజమైన అనురాగం మాత్రమే
కాదు… ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చైనాకు శాశ్వత సభ్యదేశంగా ఉన్న వీటో అధికారం
కూడా కారణమే.
భారతదేశం దురదృష్టం ఏమిటో
తెలుసా…. భద్రతామండలిలో వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశంగా భారత్‌కు అవకాశం
వస్తే, దాన్ని చేజేతులారా చైనాకు వెండిపళ్ళెంలో పెట్టి మరీ అందించింది ఎవరో
తెలుసా… హిందీ చీనీ భాయీభాయీ అంటూ పంచశీల సూత్రాలు ప్రతిపాదించిన శాంతిదూత మన
ప్రథమ ప్రధానమంత్రి జవాహర్లాల్ నెహ్రూయే. అప్పుడే పంచశీల సీలలు ఊడగొట్టి మన దేశంపై
యుద్ధం ప్రకటించిన చైనా, నాటినుంచీ పాకిస్తాన్‌కు అండగా నిలుస్తూనే ఉంది, ఆఖరికి
పాకిస్తాన్ భారతదేశంపై ప్రయోగిస్తున్న ఉగ్రవాదానికి ఐక్యరాజ్యసమితిలో సైతం మద్దతు
పలుకుతూనే ఉంది. అదీ సంగతి.