అయోధ్య
రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోందని ప్రధాని
మోదీ అన్నారు. ఆద్మాత్మిక నగరి అయోధ్య పర్యటనలో ఉన్న ప్రధాని, పలు అభివృద్ధి, ఆద్మాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అయోధ్యలో
రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా జనవరి 22న దేశవ్యాప్తంగా ప్రజలంతా
నివాసాల్లో రామజ్యోతిని వెలిగించాలని పిలుపునిచ్చారు.
దేశం కోసం నవ సంకల్పం
తీసుకురావాలన్నారు. ఇప్పటి వరకు టెంట్ కింద ఉన్న రామ్ లల్లా పక్కా ఇంటికి
మారబోతున్నారన్నారు. తమ ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు పక్కా గృహాలు
అందజేసిందన్నారు.
శ్రీరాముడి
జన్మస్థలంలో పర్యటించిన ప్రధాని మోదీకి స్థానికులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం
నుంచి అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ వరకు 15
కిలోమీటర్ల పొడవునా ప్రధానికి హర్షధ్వానాల మధ్య ఆత్మీయ స్వాగతం పలికారు. దేశంలోని
వివిద ప్రాంతాలకు చెందిన సుమారు 1400 మంది కళాకారులు వివిద సాంస్కృతిక
కార్యక్రమాలతో అయోధ్య విచ్చేసిన అతిథులను అలరించారు.
ఇటీవలే
అధునాతన హంగులతో పునర్నిర్మించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభించిన
మోదీ, రెండు అమృత్ భారత్ రైళ్ళతో పాటు ఆరు
వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం
సుమారు రూ. 240 కోట్లు ఖర్చు చేశారు. మూడు అంతస్థుల్లో నిర్మించిన ఈ స్టేషన్ కు
ఐజీబీసీ, గ్రీన్ సర్టిఫికేట్ జారీ చేసింది.
అనంతరం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమనాశ్రయాన్ని
ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడ నుంచి దేశంలోని పలు నగరాలకు విమాన సర్వీసులు
నడవనున్నాయి. ఏడాదికి దాదాపు 10 లక్షల మంది ప్రయాణం చేసేలా ఎయిర్ పోర్టు నిర్మాణం
జరిగింది. వాల్మీకి రామాయణం ఆధారంగా కూడ్య
చిత్రాలు వేశారు. రూ.1,450 కోట్లతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించినట్లు పీఎంవో
తెలిపింది.
ప్రధాని కొత్త విమానాశ్రయాన్ని ప్రారంభించిన వెంటనే దిల్లీ నుంచి అయోధ్యకు
ఇండిగో విమానం బయలు దేరింది. విమానం కెప్టెన్ అశుతోష్ శేఖర్ జై శ్రీరామ్ అని
నినదించగా ప్రయాణికులు కూడా గొంతు కలపడంతో విమానంలో ఆద్మాతిక సందడి నెలకొంది.