Plane gets stuck under bridge
బిహార్‌లోని మోతీహారీ జిల్లాలో (Motihari
district, Bihar) నిన్న శుక్రవారం ఒక విచిత్రమైన దృశ్యం
కనిపించింది. ఒక బ్రిడ్జి కింద విమానం ఇరుక్కుపోయింది (Plane stuck under
bridge). దాంతో ట్రాఫిక్‌కు భారీ అంతరాయం కలిగింది.
కాలం చెల్లిపోయిన ఒక విమానాన్ని ముంబై నుంచి
అసోంకు ట్రయిలర్ ట్రక్‌లో (Mumbai to Asom) తీసుకువెడుతున్నారు. ఆ క్రమంలో ఆ
ట్రక్కు బిహార్‌లోని మోతీహారీ జిల్లా పిప్రాకోథీ ప్రాంతంలో ఒక ఓవర్‌బ్రిడ్జి కింద
ఇరుక్కుపోయింది. దాంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులందరూ నిలిచిపోయారు. చాలాసేపు
ట్రాఫిక్ జామ్ అయింది.
బ్రిడ్జి కింద ఆగిపోయిన భారీ విమానాన్ని చూడడానికి
స్థానిక ప్రజలు తండోపతండాలుగా అక్కడికి తరలివెళ్ళారు. విమానం రహదారి మీదకు రావడం,
ఆగిపోవడం లాంటి ఘటనలు ఎప్పుడో కానీ జరగవుట్ర కాబట్టి, దాన్ని చూడడానికి ప్రజలు
పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. కొంతమంది ఆ దృశ్యాలను వీడియో తీసి సామాజిక
మాధ్యమాల్లో పంచుకున్నారు. బ్రిడ్జి కింద విమానం ఇరుక్కున్న ఘటన స్థానికంగా కలకలం
రేపింది. ఆ వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి.
వీడియో చూస్తే, 27వ నెంబర్ జాతీయ రహదారి (NH
27) మీద వందలాది వాహనాలు నిలిచిపోవడం, పిప్రాకోథీ బ్రిడ్జి కింద విమానం
సగం అటూ సగం ఇటూ ఇరుక్కుపోవడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ట్రక్కు డ్రైవర్
బ్రిడ్జి ఎత్తును సరిగ్గా అంచనా వేయలేకపోయాడు, దాని కింద నుంచి విమానాన్ని
తీసుకుని వెళ్ళిపోగలనని భావించాడు. అందువల్లనే ఈ సంఘటన జరిగిందని స్థానిక
అధికారులు వివరించారు. కొన్ని గంటల ప్రయత్నం తర్వాత లారీ, విమానం క్షేమంగా బైటపడ్డాయి.
తమ గమ్యస్థానం వైపు వెళ్ళిపోయాయి.
2022 నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని
బాపట్ల జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక రహదారి అండర్‌పాస్ కింద
విమానం ఇరుక్కుపోయింది. ఆ తర్వాత మళ్ళీ అలాంటి సంఘటన ఇప్పుడు బిహార్‌లో చోటు
చేసుకుంది.