వేర్పాటువాద తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ కెనడాలో ఆశ్రయం పొందుతోన్న గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లండాను భారత్ ఉగ్రవాదిగా ప్రకటించింది. దోపిడీలు, హత్యలు, ఉగ్రదాడులతో (crime news) ఇతనికి సంబంధం ఉందని గట్టి ఆధారాలు లభించడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం శాఖ అధికారులు వెల్లడించారు. 33 ఏళ్ల లండా పంజాబ్లోని తరన్ తరన్ జిల్లాకు చెందిన వ్యక్తి.
2022లో మొహాలిలోని పోలీసు ఇంటిలిజెన్స్ ప్రధాన కార్యాలయంపై జరిగిన రాకెట్ దాడికి ఇతడే ప్రధాన కుట్రదారుగా తేలింది.ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లండాపై దోపిడీలు,హత్యలు, ఉగ్రదాడులు, మాదకద్రవ్యాల స్మగ్లింగ్తోపాటు, దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చాడనే కేసులున్నాయి.
2017లోనే లఖ్భీర్ కెనడా పారిపోయాడని హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఖలిస్థానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడిగా పనిచేస్తున్నాడని విచారణలో తేలింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్తోనూ ఇతనికి సన్నిహిత సంబంధాలున్నాయని కేంద్రం వెల్లడించింది.