ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి : 13
మంచి వెన్నెల వేళ :: చలితహరిణ నయనా!
లెమ్మా! – కాత్యాయనీ వ్రతం – 13
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
**************************
అప్పుడే కళ్ళిప్పి లోకాన్ని ముగ్ధంగా
పలకరిస్తున్న సుమబాలలకు మంచు ముత్యాలు ముస్తాబు చేస్తున్నాయి. నిన్న లేని
సుగంధాన్ని విరజిమ్ముతున్న వాటి నెమ్మోము సోయగాలను చూసి తెమ్మెర ఆశ్చర్యపోతోంది. విచ్చుకోవాలని
ప్రయత్నిస్తున్న కమలాన్ని చూసి “ఇలాంటి కళ్ళెక్కడో చూసానే!” అని గుర్తు
తెచ్చుకోడానికి ప్రయత్నిస్తోంది. ఆ కమలాల కనుదోయి గల చిన్నది ‘వారిజ‘.
చెంపకు చారెడు కన్నుల వయారి! హాయి
నిద్దురపోతోంది. చెలియలందరూ తన మొగసాల నిలచి తనను పిలుస్తూంటే తను మాత్రం స్వప్నలోకాలలో
తేలుతోంది. నిద్రాదేవికి ఎంత ముద్దొచ్చాయో ఆమె కళ్ళు.. వీడిపోనంటోంది! తమ నిడివిని
కట్టడి చేసే కాటుక రేఖలు లేనందుకు ఆమె కనుదోయి మిడిసిపడుతోంది. నల్లని కనురెప్పలు వంపు తిరిగి కాటుక లేని లోటు
తీరుద్దామని ప్రయత్నిస్తున్నాయి. ఆమెది అద్భుతమైన దేహఛ్ఛాయ! మంచి గంధపు నిగ్గులో
మెరిసిపోతోంది. ఆమె కట్టుకున్న నీలిచీర ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తోంది.
కోమలంగా పూలచెండులా ఉన్న ఒక చేతిని గుండెల మీద, రెండో చేతిని
నుదుటి మీద వేసుకుని చిత్రమైన నాట్య భంగిమలో నిద్రపోతున్న కిన్నెరలా ఉంది.
రోజూ ఎవరో ఒక చెలియ ఇంకా నిద్దుర పోవడం, తాము వెళ్ళి
కృష్ణలీలాగానంతో మేలుకొలపడం అలవాటైన గోపకాంతలు “ఈ రోజెవరి ఇల్లు..?” అని
వెతుక్కుని వారిజ ఇంటి ముందు నిలబడి పిలుస్తున్నారు.
“ఓ అమ్మాయీ, వారిజా! నువ్వు నిద్రపోవడానికి కారణం మాకు బాగా తెలుసు. నీ అందమైన
కళ్ళు కన్నయ్యకే ఎంతో ఇష్టమైనవి. వాటి తళతళల్లో తన రూపు చూసుకుని మురిసిపోతాడతను.
ఆ రోజు బృందావనిలో తటాకం ఒడ్డున కూర్చుని నీ సారసనేత్రాలకు అంజనం దిద్దడం మేము
చూసాం లే! అలాంటి కళ్ళను రాత్రైతే మాత్రం విడిచి పెడతాడా..! కలలోకొచ్చి వెళ్ళనని
మారాం చేస్తున్నాడు కాబోలు! కానీ తెల్లారబోతోంది. కలలు పక్కనపెట్టి నిద్రలేచే సమయం
ఆసన్నమైంది. లే లే! యమునకి వెళ్ళి స్నానం చెయ్యాలి.” పిలిచింది ఉత్పల.
లోపల నుంచి అలికిడి లేదు. అలాగే బంగరు బొమ్మలా
నిద్రపోతోంది వారిజ.
“హ్మ్… అంత సులువుగా ఎందుకు నిద్ర లేస్తావు!? మా మనసులను విరహకీల
దహిస్తోంది. ఎంతట చన్నీట మునిగి ఈ తాపం తీర్చుకుందామా అనిపిస్తోంది. నీకేమో కలలో
కూడా ఎడబాటు తెలియనివ్వట్లేదతడు. చాలులే కలలు! లేవమ్మా లే లే!”
నిష్టూరాలాడింది విష్ణుప్రియ.
“పక్షులు నిద్ర లేచాయి. మేత వెళ్ళేముందు తమ పిల్లల్ని గూళ్ళలో వదిలి, బోలెడు జాగ్రత్తలు
చెప్తున్నట్టు కిలకిలారావాలు చేస్తున్నాయి చూడు! వినబడలేదా! ఎంత మొద్దు
నిద్రపోతున్నావో! నీలాంటి సుకుమారికి.. అందాల భరిణకు తగిన నిద్ర కాదు సుమా!”
“పక్షులు మా అలికిడికే నిద్రలేచాయనుకుంటున్నావేమో!
బయటకు వచ్చి చూడు! బృహస్పతి అస్తమించాడు. తూర్పు దిక్కున శుక్రతార దేదీప్యమానంగా
వెలుగుతోంది. శుక్రుడిని చూస్తూనే మునిపల్లెలో వేదాధ్యయనం మొదలైపోయింది. వినబడలేదా?” పిలిచింది
సురభి.
“కృష్ణుడి కథలేమైనా చెప్తే గానీ బయటకు రావద్దని నియమం పెట్టుకున్నావా? ఓ పిల్లా! కృష్ణుడి
అద్భుత శౌర్యగాధలు చెప్తే నువ్వు భయపడతావు. నీ లేడి కళ్ళలో భీతి కృష్ణుడే కాదు…
మేమూ చూడలేము.” విష్ణుప్రియ బెదిరించింది.
“ఓయమ్మో! నువ్వేదో పెద్ద
ధైర్యస్తురాలివన్నట్టూ..!” నవ్వింది విష్ణుప్రియని చూస్తూ కమలిని.
“నాకేం భయం లేదు. కథ చెప్పి చూడండి
కావాలంటే..” రోషపడింది విష్ణుప్రియ.
“సరే, ఎలాగూ ఆ అమ్మడూ లేచి రావాలి కదా.. కన్నయ్య లీల ఒకటి చెప్తాను. వినండి.
ఒక రోజు ఆలమందలనూ, అల్లరి నేస్తాలనూ వెంటబెట్టుకుని కృష్ణుడు అడవిలోకి వెళ్ళాడట!”
మొదలుపెట్టింది సురభి.
“ఊ..”
“పశువులన్నీ మేత మేసాయి. చల్లని నీళ్ళు తాగాయి.
చెట్ల నీడల్లో పడుకుని తిన్న మేత నెమరేసుకుంటున్న మందలో ఒక్కసారి కలకలం మొదలయింది.
‘ఏవిటా..!‘ అని గోపాలకులందరూ వెళ్ళి చూద్దురు కదా.. హిమాలయంలా ఓ పేద్ద
కొంగ!”
“కొంగా!”
“ఆ.. అవును. కొంగే! పశువులు దాన్ని చూసి
భయపడి పరుగులు తీయనారంభించాయి! పెద్ద కొండలా భీకరాకారంలో ఉన్న ఆ కొంగ సరాసరి కన్నయ్య
మీదికి వచ్చేసింది!”
“హమ్మయ్యో!” బెదురుతూ అనబోయి తమాయించుకుంది
విష్ణుప్రియ.
“ఊ.. పేద్ద నోరు తెరిచి కన్నయ్యని అమాంతం
మింగేసింది. పక్కనున్న గొల్లపిల్లలందరూ హాహాకారాలు చేసారు. ఏం చెయ్యాలో తోచక తమ
ములుగఱ్ఱలతో ఆ కొంగ మీదికి లంఘించి పొడవనారంభించారు. తనను
మింగిన కొంగ గొంతులో కన్నయ్య అడ్డంగా నిలబడ్డాడు. మండే అగ్ని గోళాన్ని మింగినట్టు ఆ కొంగకి
చెప్పలేని బాధ కలిగి నోరు తెరిచిందిట.”
“ఆ..!!”
“నోట్లోంచి బయటకు వచ్చిన కన్నయ్య దాని ముక్కు
పట్టుకుని విడదీసి చీల్చి చంపేసాడట!”
“హమ్మయో!” ఈ సారి తన కోలకళ్ళలో
తొంగిచూస్తున్న బెదురుకి ముసుగు వెయ్యలేకపోయింది విష్ణుప్రియ.
“అదిగో.. చూసావా.. భయపడిపోయావు.” నవ్వింది
సురభి.
“ఏం కాదు. కన్నయ్యవన్నీ దుడుకు పనులే! ఆనందినీ..
ఎంచక్కా కమ్మని రామకథ చెప్పవచ్చు కదా!” ఆనందిని వైపు చూస్తూ అడిగింది.
“మనం కృష్ణుడికోసం వ్రతం చేస్తూ రాముడి కథెలందుకు? కన్నయ్య కథలెన్ని
చెప్పుకున్నా తరగవు.”అంది కమలిని.
ఆమె రామకథను కాదనడం ఎవరికీ నచ్చలేదు. అందరూ ఒకరి
ముఖాలు ఒకరు చూసుకున్నారు. వేళ్ళతో చీరకొంగు ముడి వేసి విప్పుతూ ఎటో చూస్తున్న ఆ
వెర్రి గొల్ల పడుచు మనసులో, కృష్ణుడి మీదున్న ప్రేమ అర్ధమయింది ఒక్క ఆనందినికే! ఆమె చిన్నగా
నవ్వుకుంది.
“సరే కమలినీ.. నువ్వెలా అంటే అలాగే! కన్నయ్య
కథొకటి చెప్తాను వినండి.” చెప్పడం మొదలుపెట్టింది.
“ఓ నాడు కన్నయ్య బువ్వ తిననని మారాం చేస్తున్నాడట. అవును మరి! పగలంతా
ఊళ్ళో అందరి ఇళ్ళలోనూ దొంగతనంగా దూరి వెన్నలూ, పాలూ తిన్నంత తిని, తాగినంత తాగి, తన నెచ్చెలులకు
పెట్టి, ఇంకా మిగిలితే కోతిపిల్లలకు పెట్టేవాడాయె .. ఇంక సందెవేళ ఆకలెలా
వేస్తుంది!”
ప్రశాంతంగా మారిపోయాయందరి ముఖాలూ! చిన్ని
కృష్ణుని కబుర్లు వెన్నముద్దలంత ముద్దుగా ఉంటాయి కదూ!
“అప్పుడేమో యశోద అల్లరి నల్లనయ్య వెనుక ఇల్లంతా
పరుగులు పెట్టింది. “నాకొద్దంటే వద్దని” చిక్కకుండా లేడి కూనలా పరుగులు
తీస్తూ కన్నయ్య…! యశోద అలా ఎంతో సేపు పరిగెట్టాక విసుగొచ్చి బువ్వ పెట్టకుండా
ఊరుకుందామనుకుంది. ఓ స్థంభానికి చారపడి అలుపు తీర్చుకుంటోందట . ఉయ్యాల బల్ల మీద
ఎక్కి కొంటె నవ్వులు నవ్వుతున్నాడట అల్లరి పిల్లాడు!”
“హ్హహ్హహ్హహా..!”
“యశోదకి పట్టలేని పంతం వచ్చింది. ఎలాగైనా
తినిపించి తీరాలనుకుంది. కన్నయ్యకి ఇష్టమైన కథ చెప్పడం ప్రారంభించింది.”
“ఏం కథా?”
“రామ చంద్రుడి కథ! పాయసం తిని కౌసల్య కన్న
తియతియ్యని రాముని కథ.”
“నువ్వు భలే దానివి సుమీ! ఊ.. చెప్పు
చెప్పు!” వెన్నెల పువ్వు విచ్చుకున్నట్టు నవ్వేసింది కమలిని.
“రాముడు పుట్టాడు. శివధనువు విరిచి సీతాకాంతను
చేపట్టాడు. కల్యాణమాడాడు. మంధర మాటలు విని కైక కూడని కోరికలు కోరింది. తండ్రి మాట
దాటని రామయతండ్రి అడవుల పాలయ్యాడు.”
“….”
“అదిగో.. అలా చూస్తే ఆపేస్తాను.” సజలనయనాలతో
చూస్తున్న చెలులని హెచ్చరించింది ఆనందిని.. తర్జని చూపుతూ!
“లేదులే చెప్పు.”
“ఇంతలో పసిడి మాయలేడిని చూసి సీతమ్మ ముచ్చట
పడిందా.. తెచ్చి ఇస్తానని రాముడు అడవిలోకి వెళ్ళాడు. అన్నకి సాయం లక్ష్మణుడిని
పంపిందామె. మాయ రావణుడు బిక్ష వెయ్యమన్నాడు. గీత దాటిన సీతను ఎత్తుకుపోతున్నాడు..
ఆ పాటికే బువ్వ తినేసి అమ్మ కొంగుకి మూతి తుడుచుకుని, అమ్మ ఒళ్ళో
తలపెట్టుకుని మాగన్నుగా నిద్రపోతూ ‘ఊ‘ కొడుతున్న కన్నయ్య హఠాత్తుగా మెరుపులా పైకి లేచి “సౌమిత్రే! ధనుః
!!” “లక్ష్మణా, నా
విల్లేదీ!” అని గర్జించాడట.”
“అవునా!!” లక్కపిడతల్లా నోళ్ళు వెళ్ళబెట్టి, కళ్ళింతలు చేసి
అడుగుతున్న వాళ్ళందరినీ చూసి ఫక్కున నవ్వేసింది ఆనందిని.
“నవ్వుతావేంటీ!? అలా అడిగాడా!
నిజమా!” చిన్నబుచ్చుకుంది కమలిని.
“అడగడూ మరి! అతనే తానైనపుడు! అప్పుడు రాముడు –
ఇప్పుడు కృష్ణుడు. అవసరాన్ని బట్టి వేషం వేస్తాడు జగన్నాటక సూత్రధారి.”
“నిజమే కదూ! ఏంటో అలా మాట్లాడేసాను. అపచారం..
అపచారం!” లెంపలు వేసుకుంది కమలిని.
“పరవాలేదులే! తప్పులేని వారెవరు! “నీలమేఘనిభం.. అంజన కుంతలం..” అని
వర్ణించారు కన్నయ్యని. రాముడూ కృష్ణుడూ నీలిమబ్బు వన్నె వారే! కాటుక నల్లని కురుల
వారే! కలువ కన్నుల వారే!” నవ్వింది ఆనందిని.
ఇంకా నిద్రలేవని తమ సఖికి మేలుకొలుపు
పాడనారంభించారు.
లలితశయనా! చలిత
హరిణ
నయనా! లెమ్మ!
తెలవారుచున్నదమ్మా!
అలరు
కొమ్మా! తళుకు
పసిడి
బొమ్మా! లెమ్మ!
తెలవారుచున్నదమ్మ!
పులుగులవె మేతలకు తరలెను
మెల్లమెల్ల
గురుడస్తమించేను
అల
శుక్రతార మింట పొడిచెను
కలసి
మాతో రమ్మ! కపటమును విడువమ్మ!
బకదైత్య వైరి! ఆ దశకంఠ సంహారి
అకలంక
చరితముల ఒక చోట చేరి
ఈ
పుణ్య దివసాన సకియలు పాడేరు
తీపారు
వలినీట తీర్థమాడగదమ్మ!
తెలవారుచున్నదమ్మా!
లలితశయనా!
హరిణనయనా!
నెమ్మదిగా విచ్చిన ఆమె కమలాల కనుల కెంజాయ
జీర మెరిసింది. మంచు ముత్యాల గిలిగింతలకు నవకమలం విరిసింది. పూలసజ్జలు నింపుకుని
వస్తున్న పూబంతులను చూసి పలకరింపుగా యమున తరగలతో నవ్వింది.
(ఇంకొన్ని కబుర్లు రేపు)
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి
కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత)
(ఆండాళ్ “తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య
ప్రణీత “శ్రీమదాంధ్ర భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి గారి “హరి వంశము”
ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)