గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్ ఫైల్ చేయని వారికి, ఆదాయపన్ను శాఖ (IT returns) చివరి అవకాశం కల్పించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంకా లక్షలాది మంది రిటర్నులు దాఖలు చేయలేదని ఐటీ శాఖ గుర్తించింది. వీరంతా డిసెంబరు 31లోపు ఫైల్ చేయాలని హెచ్చరించింది. ఇప్పటికే ఐటీఆర్ ఫైల్ చేసిన వారికి, ఏమైనా తప్పులున్నా సరిదిద్దుకునే అవకాశం కల్పించారు.
నేటికీ ఐటీ రిటర్నులు దాఖలు చేయని వారు రూ.1000 అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. తప్పులు సరిదిద్దుకునే వారు మాత్రం ఎలాంటి రుసుములూ చెల్లించాల్సిన పనిలేదు. ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసే వారు కూడా సాధారణ రిటర్నులు మాదిరే చేయాల్సి ఉంటుంది. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు.. రూ.1000, అంతకంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు రూ.5 వేల అపరాధ రుసుము చెల్లించాలి. పన్నులు బాకీ ఉన్నవారిపై 1 శాతం వడ్డీ భారీ కూడా పడనుంది.