Inspiration of Sivaji
in new uniforms of Navy Admirals
భారత నౌకాదళం (Indian Navy) ఇవాళ అడ్మిరల్ స్థాయి అధికారుల భుజకీర్తుల కొత్త డిజైన్లను విడుదల
చేసింది. డిసెంబర్ 4న నేవీ డే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,
నేవీ అడ్మిరల్స్ కొత్త భుజకీర్తులు (Epaulettes) ఛత్రపతి శివాజీ మహరాజ్ వారసత్వాన్ని ప్రతిఫలించేవిగా ఉంటాయని
చెప్పారు. ఆ మాటలను అనుసరిస్తూ భారత నౌకాదళం కొత్త భుజకీర్తులను రూపొందించింది.
భారత నౌకాదళంలో అడ్మిరల్స్లో మూడు
స్థాయుల అధికారులు (Three
levels of officials) ఉంటారు. వారి భుజకీర్తుల మీద వారి స్థాయిని
బట్టి నక్షత్రాల సంఖ్య ఉంటుంది. అడ్మిరల్‌కు (Admiral)
నాలుగు నక్షత్రాలుంటాయి. వైస్ అడ్మిరల్‌కు (Vice Admiral) మూడు నక్షత్రాలు,
రియర్ అడ్మిరల్‌కు రెండు నక్షత్రాలూ(Rear Admiral) ఉంటాయి.
కొత్త భుజకీర్తి మీద అష్టభుజి ఆకారంలో ఎర్రని
రంగులో రాజముద్ర ఉంది. అష్టభుజి ఎనిమిది దిక్కులకూ ప్రతీక. అంటే అన్నిదిశల్లోనూ
దీర్ఘకాలిక దృష్టి ఉంటుందని అంతరార్ధం. అష్టభుజి మీద ‘సత్యమేవ జయతే’ అని ఉంది.
అంటే నిజమే గెలుస్తుంది అని అర్ధం. భుజకీర్తి మీద నేవీ చిహ్నం ముద్రించిన
బంగారురంగు బొత్తాలున్నాయి. బానిస మనస్తత్వానికి దూరంగా ఉండాలని వాటి భావం. ఇందులో
ఎర్రని అష్టభుజిని ఛత్రపతి శివాజీ రాజముద్ర స్ఫూర్తితో స్వీకరించారు.
భారత నౌకాదళం తమ చిహ్నాన్ని గతేడాది
మార్చుకుంది. అంతకుముందు సెయింట్ జార్జ్ క్రాస్ (సిలువ) బొమ్మ చిహ్నంగా ఉండేది. అది
భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వపు పాలనా కాలానికి చిహ్నం. దానిమీద నీలిరంగు
అష్టభుజి, అందులో లంగరు మీద జాతీయ చిహ్నం ఉండేవి. ఇప్పుడా రాచరిక లక్షణాలు
వదిలిపోయాయి.
రాజముద్ర కింద భారతీయ ఖడ్గాన్ని
ముద్రించారు. అది జాతి శక్తికి, ఆధిక్యానికీ, యుద్ధాల్లో ఆధిక్యానికీ,
ప్రత్యర్ధులపై విజయానికి, సవాళ్ళను అధిగమించడానికీ చిహ్నం. దానికి అడ్డంగా
దూరదర్శిని (టెలిస్కోప్) ఉంచారు. గతంలో ఆ స్థానంలో కాగడా ఉండేది.
గతేడాది భారతదేశపు మొట్టమొదటి పూర్తి
స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మితమైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ షిప్ ఐఎన్ఎస్ విక్రాంత్‌ను
జలప్రవేశం చేయించిన సందర్భంలో ప్రధానమంత్రి భారత నౌకాదళపు కొత్త చిహ్నాన్ని
ఆవిష్కరించారు. ఆ సందర్భంలోనే ‘‘భారత నౌకాదళపు జెండాలు బానిసత్వపు చిహ్నాలను
మోస్తున్నాయి, వాటిని ఛత్రపతి శివాజీ మహరాజ్ స్ఫూర్తితో తీర్చిదిద్దిన కొత్త
చిహ్నాలతో మారుస్తాం’’ అని వెల్లడించారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఈ కొత్త
చిహ్నాలు రూపొందాయి.
శివాజీ వద్ద 60 యుద్ధనౌకలు, సుమారు 5వేల
మంది సైనికులతో కూడిన నౌకాదళం ఉండేది. శివాజీ కాలంలో పెరిగిన మరాఠా నౌకాబల
సామర్థ్యం విదేశీ శక్తుల నుంచి తీర ప్రాంతాలను రక్షించుకునే క్రమంలో మొదటి ప్రయత్నం.
దేశానికి బలమైన నౌకాదళం ఆవశ్యకతను, ప్రాధాన్యతనూ మొదట గ్రహించినవాడు శివాజీ. ఆయనకు
కోటల బలం మీద నమ్మకం ఉండేది. అందుకే తీరప్రాంతాల్లో ఎన్నో కోటలు నిర్మించాడు.
వాటిలో కొంకణ తీరంలో ప్రముఖమైనవి విజయదుర్గ్, సింధుదుర్గ్. అతను తన కోటలను
ప్రధానంగా కొంకణ తీరాన్ని ఎదురు నుంచి చూసేలా కొండలపై నిర్మించాడు.