ప్రజా సమస్యలు పై వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తే అరెస్టులు చేస్తారా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి (ap bjp chief purandeswary) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి ప్రజల సమస్యలపై వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించిన బీజేపీ నేతల అరెస్టును ఆమె ఖండించారు. అరెస్టైన నేతలను కలసి పురందరేశ్వరి మనోధైర్యం చెప్పారు. పార్టీ బలోపేతం చేసేందుకు ఆమె కాకినాడ, భీమవరంలో పర్యటించారు.
కార్యకర్తల మనోభావాలు తెలుసు కోవడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయడంతోపాటు, రాజకీయ సమీకరణలు కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.ఏపీలో కేంద్ర సాయంతోనే అభివృద్ధి జరుగుతోందని పురందరేశ్వరి గుర్తుచేశారు. కేంద్ర సాయంతో ప్రతి జిల్లాలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి జరుగుతోందని ఆమె గుర్తుచేశారు.
కత్తి పూడి, రాజోలు జాతీయ రహదారి, ఎలక్ట్రానిక్ జోన్ మంజూరు చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయలేదని ఆమె తప్పుపట్టారు. కాకినాడ టూరిజం,మడ అడవుల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చిందని వెల్లడించారు. దేవుడు వరమిచ్చినా, పూజారి అనుగ్రహం ఇవ్వని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనపడుతోందని ఆమె ఎద్దేవా చేశారు.