తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడి నోటీసులు (cid notice to nara lokesh) జారీ చేసింది. తప్పుడు కేసులు పెడుతోన్న పోలీసు అధికారుల పేర్లు రెడ్ బుక్‌లో రాసుకుంటున్నానని, అధికారంలోకి రాగానే వారి అంతు చూస్తామంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ సీఐడి నోటీసులు పంపింది. లోకేశ్ అధికారులను బెదిరిస్తున్నారంటూ సీఐడీ అధికారులు, ఏసీబీ కోర్టును ఆశ్రయించారు.
కోర్టు సూచనల మేరకు లోకేశ్‌కు సీఐడీ అధికారులు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. నోటీసులు అందుకున్నట్లు లోకేశ్ నుంచి సమాధానం వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ కేసును విజయవాడ ఏసీబీ కోర్టు జనవరి 9న విచారించనుంది. యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ చూపిస్తూ పోలీసులు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, తాము అధికారంలోకి వచ్చాక అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామంటూ లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై సీఐడీ చర్యలకు ఉపక్రమించింది.