ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఇప్పటి వరకు ప్రత్యక్ష పన్నుల (direct taxes) వసూళ్లలో 20 శాతం వృద్ధి నమోదైంది. ఇదే ట్రెండ్ కొనసాగితే ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19 లక్షల కోట్లకు చేరుకుంటాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక చేపట్టిన సంస్కరణల వల్లే పన్నుల వసూళ్లు దూసుకెళుతున్నాయనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
2013-14లో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.6.38 లక్షల కోట్లు కాగా గత ఆర్థిక సంవత్సవరంలో రూ.16.61 లక్షల కోట్లు వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.19 లక్షల కోట్లకు చేరుకోవచ్చనే అంచనాలున్నాయి.మినహాయింపులు వదులుకుంటోన్న కార్పొరేట్లకు తక్కువ పన్ను పరిధిలోకి తీసుకురావడంతో గడచిన మూడేళ్లలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగాయి.
వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని రూ.3 లక్షలకు పెంచారు. రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ కూడా ఉంది. పదేళ్ల కిందట 3.36 కోట్ల ఐటీఆర్లు దాఖలు కాగా తాజాగా అక్టోబర్ 2023 చివరి నాటికి 7.41 కోట్లకు చేరింది. వీరిలో 53 లక్షలు కొత్తవి కావడం విశేషం. జీఎస్టీ వసూళ్లు కూడా వేగంగా పెరుగుతున్నాయి. గత ఏప్రిల్ మాసంలో రూ.1.87 లక్షల కోట్లు వసూలయ్యాయి.