Maa Sita withdrew her curse
రామయ్య (Lord Ram) జన్మస్థలం అయోధ్యను సీతమ్మ శపించిందట. (Curse of Sita) ఆ శాపాన్ని ఇప్పుడు ఉపసంహరించుకుందట. ఆ మాట చెబుతున్నది వేరెవరో
కాదు… స్వయానా అయోధ్య రాజవంశపు ప్రస్తుత వారసుడే.
అయోధ్యను (Ayodhya) 19వ శతాబ్దంలో దర్శన్‌సింగ్ అనే మహారాజు కొంతకాలం పరిపాలించారు. దేశంలో
రాజరికాలు పోయినా రాజవంశీకులు నిలిచి ఉన్నట్లే రాజా దర్శన్ సింగ్ వారసులు కూడా
నేటికీ ఉన్నారు. ఆ వంశంలో ఇప్పుడు ఉన్న వ్యక్తి విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా (Bimlendra Mohan Pratap Mishra). అయోధ్యానగర
ప్రజలు ఆయనను మహారాజుగా నేటికీ వ్యవహరిస్తారు. రామజన్మభూమి ఉద్యమం మొదలైన నాటినుంచి
నేడు రామాలయ ప్రాణప్రతిష్ఠ వరకూ ప్రతీ కార్యక్రమంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నారు.
ప్రస్తుతం గుడి కడుతున్న శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో ఒక సభ్యుడిగా ఆయన
మందిర నిర్మాణ కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు.
2024 జనవరి 22న అయోధ్య రామజన్మభూమిలో
బాలరాముడి మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఆయన ఒక ఆసక్తికరమైన ముచ్చట
పంచుకున్నారు.
అయోధ్యలో స్థానికులు చెప్పుకునే కథనాల
ప్రకారం… ఆ నగరానికి ఒక శాపం ఉంది. ఆ శాపాన్నిచ్చింది స్వయంగా సీతామాతే. రావణాసురుడి
చెర నుంచి సీతమ్మను విడిపించాక సీతారాములు 14ఏళ్ళ వనవాసం పూర్తి చేసుకుని అయోధ్యకు
తిరిగివస్తారు. ఆ తర్వాత కొందరు జానపదులు, అన్నాళ్ళు రాక్షసుడి చెరలో ఉన్న
సీతమ్మను రాముడు ఎలా ఏలుకుంటున్నాడో అని భావిస్తారు. ఆ విషయాన్ని చారుల ద్వారా
తెలుసుకున్న రాముడు, సీతమ్మను మళ్ళీ అడవిలో వదలివేస్తాడు. దాంతో సీతమ్మ తీవ్ర
వ్యాకులతకు లోనవుతుంది. తనకు రాముడితో వియోగం కల్పించిన అయోధ్యావాసుల పుకార్లపట్ల
ఆగ్రహిస్తుంది. ఆ కోపంలో, ఆ వ్యాకులతలో సీతామాత, కోసల రాజ్యానికి రాజధానీ నగరమై,
యుగయుగాలుగా ఖ్యాతి గడించిన అయోధ్యకు ఇకపై అనామకంగా మిగిలిపోతుందని శపిస్తుంది.
అందువల్లనే ఇన్నాళ్ళూ అయోధ్య ఎలాంటి అభివృద్ధికీ నోచుకోకుండా పోయింది. ఇదీ
స్థానికులు చెప్పుకునే ఐతిహ్యం.
ఇప్పుడు రామజన్మభూమిలో
శ్రీరామచంద్రమూర్తికి ఆలయ నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఆ నగరం అద్భుతమైన
అభివృద్ధిని చవిచూస్తోంది. ఆ విషయాన్ని విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా ఇలా
వివరించారు.
‘‘సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయోధ్యలో
పండుగ వాతావరణం నెలకొంది. ఒక తాత్కాలిక ఆలయం నిర్మాణం జరిగింది. అప్పటినుంచీ
అయోధ్యకు భక్తుల తాకిడి గణనీయంగా పెరిగింది. సెలవు రోజుల్లో, మంగళవారాల్లో,
పర్వదినాల్లో ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. కొన్నేళ్ళ క్రితం వరకూ ఈ ఊళ్ళో
సరైన హోటల్ ఒక్కటి కూడా లేదు. అయితే ఇప్పుడు ఇక్కడ ఫైవ్‌స్టార్ హోటళ్ళు కట్టడానికి
వందకు పైగా దరఖాస్తులు వచ్చాయని జిల్లా కలెక్టర్ చెప్పారు.’’
‘‘అయోధ్యను ఇప్పుడు స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతున్నారు.
నా అంచనా ప్రకారం మరో ఐదేళ్ళలో అయోధ్యకు జనాలు కేవలం బాలరాముడి దర్శనానికి మాత్రమే
రారు. వారు రాముడు జన్మించిన అయోధ్యా నగరాన్ని సందర్శించడానికి పోటెత్తుతారు.
అయోధ్య దేశంలోనే అత్యుత్తమమైన పవిత్రక్షేత్రంగా వాసి గడిస్తుంది’’ అని రాజాసాహెబ్
చెప్పారు.
మరికొద్ది రోజుల్లో జరగనున్న బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యా నగరం కొత్త సొబగులు దిద్దుకుంటోంది. నగరంలో కొత్త
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైంది. రైల్వేస్టేషన్ సరికొత్త హంగులు సమకూర్చుకుంది.
ఊరంతా సమగ్రంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో ఈ పుణ్యక్షేత్రానికి ఇకపై కోట్లాది
మంది భక్తులు సందర్శిస్తారని అంచనా.
ఇలా అభివృద్ధి చెందుతున్న
నగరాన్ని చూసి అయోధ్యా పాలకుల వంశీకుడైన విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్రా, ‘‘సీతా
మాత మా ఊరికిచ్చిన శాపాన్ని ఉపసంహరించుకుందని అనిపిస్తోంది’’ అంటూ హర్షం వ్యక్తం
చేసారు. ‘‘నేను బతికుండగా రామమందిర నిర్మాణాన్ని చూడగలుగుతానని అనుకోనేలేదు. ఇది
నా పూర్వజన్మ సుకృతం’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.