Ayodhya Airport to be named after Maharshi Valmiki
రామజన్మభూమి అయోధ్యలో కొత్తగా నిర్మించిన
అంతర్జాతీయ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి (Maharshi
Valmiki) పేరు
పెట్టనున్నారు. ఈ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిసెంబర్ 30న
ప్రారంభిస్తారు.
మరికొద్దిరోజుల్లో అయోధ్యానగరంలో బాలరాముడి
ఆలయానికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఆ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయోధ్యకు
మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. ఆ క్రమంలోనే అక్కడ విమానాశ్రయం
నిర్మించారు. (Ayodhya International Airport) ఈ శనివారం
అంటే రేపు డిసెంబర్ 30న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM
Narendra Modi) విమానాశ్రయ ప్రారంభోత్సవం చేస్తారు. రామాయణకర్త
వాల్మీకి మహర్షి పేరిట ఆ విమానాశ్రయానికి ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం
అయోధ్యధామ్’ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది. (Maharshi
Valmiki International Airport Ayodhyadham)
‘‘అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన విమానాశ్రయం
మొదటిదశ పనులు పూర్తయ్యాయి. దానికి సుమారు రూ. 1500 కోట్లు వ్యయం అయింది.
విమానాశ్రయం టెర్మినల్ బిల్డింగ్ 6500 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. ఆ భవనం
సంవత్సరానికి 10లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగి ఉంది. ఆ భవనాన్ని అయోధ్య
బాలరాముడి ఆలయం తరహాలో అలంకరించారు. శ్రీరాముడి జీవితగాధను వివరించే చిత్రలేఖనాలు,
కుడ్యచిత్రాలు, స్థానిక కళాకారులు సృజించిన కళాఖండాలతో టెర్మినల్ బిల్డింగ్ నిండి
ఉంది’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.
టెర్మినల్ బిల్డింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలు
కలిగిన సాంకేతిక వ్యవస్థలు ఏర్పాటు చేసారు. ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, ఎల్ఈడీ
లైటింగ్, వాననీటి పరిరక్షణ ఏర్పాట్లు, ఉద్యానవనాలు, నీటిశుద్ధి ప్లాంట్, సివేజ్
ట్రీట్మెంట్ ప్లాంట్, సౌర విద్యుత్ ప్లాంట్ వంటి వ్యవస్థలతో ‘గృహ-ఫైవ్‌స్టార్
రేటింగ్’ సాధించేలా నిర్మాణం జరిగింది. విమానాశ్రయ నిర్మాణంతో అయోధ్యకు
కనెక్టివిటీ బాగా పెరుగుతుందనీ, దానివల్ల పర్యాటకం, ఉపాధి అవకాశాలు, వాణిజ్య
కార్యకలాపాలూ గణనీయంగా పెరుగుతాయనీ పీఎంఓ వ్యాఖ్యానించింది.
విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పాటు అయోధ్యలో సుమారు
2200 కోట్లతో అభివృద్ధి చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ టౌన్‌షిప్‌కు (Greenfield
Township) ప్రధాని
నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారు. రెండు కొత్త అమృత్ భారత్ రైళ్ళు(Amrit Bharat trains), ఆరు కొత్త
వందేభారత్ రైళ్ళను (Vande Bharat trains) పచ్చజెండా ఊపి
మొదలుపెడతారు.