భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో భారీ ప్రణాళికతో ముందుకెళుతోంది. రాబోయే ఐదేళ్లలో 50 నిఘా ఉపగ్రహాలు (isro spy satellites) ప్రయోగించేందుకు ఇస్రో సిద్దమవుతోంది. భిన్న కక్ష్యంలో ఈ ఉపగ్రహాలను ప్రవేశపెట్టనున్నారు. భూమిపై ప్రతి కదలికను ఈ నిఘా ఉపగ్రహాలు పసిగడతాయని ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు.
ప్రస్తుతం భారత్ శరవేగంగా వృద్ధి సాధిస్తోంది. అనుకున్న లక్ష్యాలు నెరవేరాలంటే ప్రస్తుతం కంటే పది రెట్లు అదికంగా ఉపగ్రహాలను ప్రయోగించాల్సి ఉందని సోమనాథ్ తెలిపారు. గురువారం ఐఐటీ ముంబైలో జరిగిన టెక్ ఫెస్ట్‌లో సోమనాథ్ ఈ విషయాలు వెల్లడించారు.
నిఘా ఉపగ్రహాలు రక్షణ రంగానికి కీలకంగా పనిచేయనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలసిస్, డేటా డౌన్లోడ్ తగ్గించడం, అవసరమైన సమాచారం సేకరించడంలో నిఘా ఉపగ్రహాలు రక్షణ శాఖకు సహాయపడనున్నాయి. సరిహద్దులపై నిఘా పెట్టడంతోపాటు, విదేశాల సైన్యం కదలికలను కూడా ఈ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు ఫోటోలు తీసిపంపనున్నాయి.