దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా విడుదలను తెలంగాణ హైకోర్టు నిలిపివేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఇప్పటికే వ్యూహం సినిమా (rgv viewham cinema) విడుదలకు ఇచ్చిన సర్టిఫికెట్‌ను జనవరి 11 వరకు నిలిపేసింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగా సినిమాను రిలీజ్ చేయవద్దని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు,ఆయన భార్య, ఆయన కుమారుడు లోకేశ్‌ను కించపరిచే విధంగా సినిమా రూపొందించారంటూ దాఖలైన పిటీషన్‌పై తెలంగాణ హైకోర్టు గురువారం సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల నుంచి విచారణ సాయంత్రం వరకు చేపట్టారు. రాత్రి 11 గంటల 30 నిమిషాలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నంద మధ్యంతర ఉత్వర్వులు జారీ చేశారు.
పిటిషనర్ లోకేశ్ తరపు న్యాయవాది ఉన్నం ముళీధర్‌రావు, ఉన్నం శ్రవణ్‌కుమార్‌లు వాదలను వినిపించారు. వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కక్ష సాధించే విధంగా వ్యూహం సినిమా నిర్మించడం సరికాదని వాదనలు వినిపించారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యుల పరువుకు నష్టం వాటిల్లేలా చిత్రం రూపొందించారని వాదనలు వినిపించారు. సినిమా ట్రైలర్ వేదికపై వైసీపీ మంత్రులు కూర్చున్నారని సాక్ష్యాలు చూపారు. నేరుగా టీడీపీ నేతల పేర్లు కూడా పెట్టారనే వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను కూడా ఉదహరించారు. సినిమా నిర్మాత తరపున నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి జనవరి 11 వరకు సినిమా విడుదలకు బ్రేక్ వేశారు.