గూఢచర్యం అభియోగాలతో ఖతర్
న్యాయస్థానంలో శిక్షపడిన భారత మాజీ నేవీ అధికారులకు ఉపశమనం దక్కింది. 8 మంది అధికారులకు
విధించిన మరణశిక్షను ఖతర్ కోర్టు తగ్గించి జైలు శిక్షగా మార్చింది. ఈ విషయాన్ని
కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
ఖతర్ లోని ప్రైవేటు
సంస్థలో పనిచేసిన
భారతీయ నేవీ మాజీ కమాండర్లు పూర్ణేందు
తివారీ, సుగుణాకర్ పాకాల, అమిత్ నాగ్పాల్, సంజీవ్ గుప్తా, మాజీ నేవీ కెప్టెన్లు
నవతేజ్ సింగ్ గిల్, బీరేంద్ర కుమార్ వర్మ, సౌరభ్ వశిష్ట్, మాజీ సెయిలర్ రాగేశ్
గోపకుమార్ ను 2022లో ఖతర్ అధికారులు అరెస్టు చేశారు. ఇజ్రాయెల్ తరఫున గూఢచర్యం చేస్తున్నట్లు
అభియోగాలు మోపడంతో విచారణ జరిపిన ఖతర్ కోర్టు మరణశిక్ష విధించింది.
ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో
అప్పీలు దాఖలు చేయగా పరిగణనలోకి తీసుకున్న కోర్టు మరణశిక్షను జైలు శిక్షకు
తగ్గించింది. దుబాయిలో జరిగిన కాప్-28 శిఖరాగ్ర సమావేశంలో ఖతార్ పాలకుడు షేక్
తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధాని మోదీ కలిసి ఈ విషయంపై మాట్లాడారు.