లష్కర్ ఎ తయ్యబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను అప్పగించాలంటూ భారత్ అధికారికంగా పాకిస్తాన్‌ను అడిగినట్లు తెలుస్తోంది. సయీద్‌ను అప్పగించాలని భారత విదేశాంగ శాఖ అధికారికంగా పాకిస్తాన్‌ను కోరిందని జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ముంబై పేలుళ్ల (mumbai blasts case) సూత్రధారి హఫీజ్‌ను అప్పగించే ప్రక్రియను మొదలుపెట్టాలంటూ కూడా భారత్ పాక్‌ను కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
2008 నవంబరు 26న ముంబైలో ఉగ్రమూకలు రక్తపాతం సృష్టించిన సంగతి తెలిసిందే. అందులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడికి హఫీజ్ సయీద్ సూత్రధారిగా ఉన్నాడని భారత్ గుర్తించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ పేరు చేర్చారు. అతనిపై రూ.8 కోట్ల రివార్డు కూడా ఉంది. ఉగ్రకార్యకలాపాలకు
ఆర్థిక సాయం చేసిన కేసులో అతనిపై మనీలాండరింగ్ కేసు కూడా ఉంది.