Shop owner attacked for
objecting offensive banners on Hindus
తమిళనాడులోని తూత్తుక్కుడిలో నలుగురు
వ్యక్తులు ఒక దుకాణదారుడిపై దాడికి పాల్పడ్డారు. అతను చేసిన నేరం ఏంటంటే తన దుకాణం
దగ్గర వారు పెట్టిన బ్యానర్ల గురించి అడగడమే. ఆ బ్యానర్లలో హిందువుల గురించి, వారి
ఆచార వ్యవహారాల గురించి అభ్యంతరకరమైన నినాదాలు రాసారు.
55ఏళ్ళ అన్బళగన్ తూత్తుక్కుడి నగరంలో
ఏపీసీ కళాశాల ఎదుట పశువుల దాణా దుకాణం నడుపుతున్నాడు. 26 డిసెంబర్ 2023న అతను తన దుకాణంలో
పని చేసుకుంటున్నాడు. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి అతని దుకాణం దగ్గర రెండు బ్యానర్లు
కట్టారు. వాటిలో హిందువులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు తమిళంలో రాసి
ఉన్నాయి. వాటిని చదివిన అన్బళగన్ కంగారు పడ్డాడు. ఆ బ్యానర్లను తొలగించమని వారిని
కోరాడు. వారికి తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ఉన్నా, ఆ హక్కు మరొకరిని అవమానించేలా ఉండకూడదని
హితవు పలికాడు.
అన్బళగన్ వాదనతో ఆ దుండగులు
రెచ్చిపోయారు. అతని మీద భౌతికదాడికి పాల్పడ్డారు. వారి దాడిలో అన్బళగన్కు తీవ్ర
గాయాలయ్యాయి. చెవి తమ్మ తెగిపోయింది. అతని అరుపులు విన్న స్థానికులు ఆ దుకాణం
దగ్గరకు రావడంతో దుండగులు అక్కణ్ణుంచి పారిపోయారు. ఈ మొత్తం ఘటనను వివరిస్తూ
అన్బళగన్ ఒక వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసాడు. ఆ వీడియో విస్తృతంగా
వైరల్ అయింది. అన్బళగన్ ఇప్పుడు దుకాణానికి వెళ్ళకుండా ఇంటికే పరిమితం అయ్యాడు. మరోవైపు,
ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం వెతుకుతున్నారు. దోషులను
కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు.
తూత్తుక్కుడిలో హిందూమతాన్ని అవహేళన
చేస్తూ బ్యానర్లు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. గతంలో అలాంటి సంఘటనలు చోటు
చేసుకున్నప్పుడు హిందూ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి, అధికారులను ఆశ్రయించి
అలాంటి బ్యానర్లను తొలగింపజేసాయి. అయితే ఈసారి దుండగులు భౌతిక దాడులకు కూడా
పాల్పడడం ఆందోళన కలుగజేస్తోంది.
ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతున్న
వేర్పాటువాద, జాతి వ్యతిరేక శక్తుల ఆగడాలను మరోసారి తేటతెల్లం చేసింది. నాస్తిక
ముసుగులోని క్రైస్తవ అనుకూల డీఎంకే ప్రభుత్వం ఎజెండాకు అనుగుణంగానే ఇలాంటి చర్యలు
జరుగుతున్నాయని హిందూవర్గాలు అనుమానిస్తున్నాయి. అధికార పార్టీని, మైనారిటీ మతాల
వారినీ విమర్శిస్తే తక్షణం విరుచుకుపడిపోయే అధికారులు, హిందువులకు వ్యతిరేకంగా
జరిగే కార్యకలాపాలను మాత్రం చూస్తూ మిన్నకుండిపోతున్నారని విమర్శకులు
ఆరోపిస్తున్నారు.