చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో చైనా, తైవాన్ మధ్య విభేదాలు (china taiwan row) భగ్గుమన్నాయి. ఎప్పటికైనా తైవాన్ తమ దేశంలో విలీనం కాక తప్పదంటూ జిన్‌పింగ్ వ్యాఖ్యానించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మావో 130వ జయంతి సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తైవాన్ మాతృభూమితో పునరేకీకరణ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. తైవాన్ను ఎట్టి పరిస్థితుల్లో చైనా నుంచి వేరుపడనీయమని చెప్పుకొచ్చారు.
తైవాన్ జలసంధి అంతటా శాంతియుత సంబంధాలు మెరుగుపరచాలని ఆయన కోరారు. తైవాన్ ఎన్నికలు, ఆ దేశంపై బలప్రయోగం వంటి అంశాలను జిన్‌పింగ్ ఎక్కడా ప్రస్తావించలేదు. వచ్చే నెల 13న తైవాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. తైవాన్‌పై దండయాత్రకు చైనా సిద్దం అవుతోందంటూ అమెరికా సైనిక వర్గాలు
హెచ్చరిస్తున్నాయి. తైవాన్ ఎన్నికల్లో డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నేత లయ్ చింగ్ టే గెలిచే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.