Ayodhya Dham Junction:
అయోధ్యలో
నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముందు రైల్వే
శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రైల్వే జంక్షన్ పేరును అయోధ్య ధామ్ గా
మార్చింది. ఈ విషయాన్ని అయోధ్య పార్లమెంటు
సభ్యుడు లల్లూ సింగ్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో అధునాతన
సౌకర్యాలతో నూతనంగా నిర్మించిన రైల్వే స్టేషన్ పేరును ఇక నుంచి అయోధ్య ధామ్ గా పిలవాలని
నిర్ణయించి ఈ మేరకు అధికారిక మార్పులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తమ నిర్ణయాన్ని
అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య
ధామ్ జంక్షన్ స్టేషన్ తో పాటు మర్యాద పురుషోత్తమ ఎయిర్ పోర్టును ప్రధాని నరేంద్ర
మోదీ డిసెంబర్ 30న ప్రారంభించనున్నారు.
రైల్వే
స్టేషన్ లో లిఫ్టు సౌకర్యం కల్పించడంతో పాటు పర్యాటక సమాచార కేంద్రం, వైద్య
సౌకర్యాలతో పాటు పలు ఇతర మౌలికవసతులు ఏర్పాటు చేశారు. జనవరి 22 తర్వాత అయోధ్యను
ప్రతీ రోజు 50 వేల నుంచి 55 వేల మంది
దర్శించుకునే అవకాశముందని అందుకు తగిన ఏర్పాట్లలో అధికారయంత్రాంగం నిమగ్నమైందని
అయోధ్య కమిషనర్ గౌరవ్ దయాళ్ తెలిపారు.
ఆలయ
నమూనాను అనుగుణంగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా అయోధ్య ధామ్ ను నిర్మించారు. రామాయణంలోని
విశేషాలు తెలిపే శిల్పాలు, కళాకృతులు ఏర్పాటు చేశారు. అయోధ్య ఆధ్మాతిక పర్యాటక
కేంద్రంగా ఎదిగేందుకు అవసరమైన అన్ని చర్యలను కేంద్రప్రభుత్వంతో పాటు బీజేపీ
నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది.
అయోధ్య ఆలయ నిర్మాణ పనులతో పాటు
రైల్వేస్టేషన్, ఎయిర్ పోర్టు పనులపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఎప్పటికప్పుడు
సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేస్తున్నారు.