Case on Ranbir Kapoor for
hurting sentiments
యానిమల్ సినిమాతో తీవ్ర విమర్శలు
మూటగట్టుకున్న హిందీ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor) తాజాగా మరో
వివాదంలో చిక్కుకున్నాడు. క్రిస్మస్ పార్టీలో తన ప్రవర్తనతో హిందువుల మనోభావాలు
దెబ్బతీసాడంటూ (Hurting sentiments)
అతనిపై కేసు నమోదయింది.
కునాల్ కపూర్ ఇచ్చిన క్రిస్మస్ పార్టీకి
రణబీర్ కపూర్ తన భార్య ఆలియా భట్, కూతురు రాహాతో (Alia Bhatt and Raha) కలిసి హాజరయ్యాడు. ఆ పార్టీకి సంబంధించిన వీడియో వైరల్ అయింది. అందులో
రణబీర్ కపూర్, కేక్ మీద మద్యం పోసి, దాన్ని అంటించి, ‘జై మాతాదీ’ (Jai Mata Di) అంటున్న దృశ్యాలున్నాయి.
ఆ వీడియోను చూసిన ముంబైకి చెందిన సంజయ్
తివారీ అనే వ్యక్తి ఆగ్రహం చెందాడు. రణబీర్ కపూర్ ప్రవర్తన హిందువుల మతవిశ్వాసాలను
హేళన చేసేదిగా ఉందని భావించాడు. దాంతో అతను ఆశిష్ రాయ్, పంకజ్ మిశ్రా అనే ఇద్దరు
లాయర్ల సహకారంతో ఘట్కోపర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసాడు.
‘‘హిందూధర్మంలో ఏ దేవతను పూజించాలన్నా
ముందుగా అగ్నిని ప్రజ్వలింపజేస్తారు. అలా అగ్నిదేవుడి పట్ల అమిత గౌరవాన్ని
చూపుతారు. అలాంటిది, రణబీర్ కపూర్ కేకు మీద మద్యం పోసి దాన్ని అంటించడం ద్వారా
అగ్నిదేవతను అవమానించాడు. పైగా, క్రైస్తవుల పండుగ వేడుకలో పాల్గొంటూ జై మాతాదీ అంటూ
అమ్మవారిని అపహాస్యం చేసాడు. అతని ప్రవర్తనతో నాలాంటి హిందువుల మనోభావాలు
దెబ్బతిన్నాయి’’ అంటూ సంజయ్ తివారీ ఫిర్యాదు చేసాడు.
ఘట్కోపర్ పోలీసులు ఫిర్యాదు
స్వీకరించారు కానీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయలేదు.