స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి జీవిత కాల గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందుతోన్న సానుకూల సంకేతాలతో, దేశీయ స్టాక్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఇవాళ ఉదయం సెన్సెక్స్ 303 పాయింట్లు పెరిగి, 72342 పాయింట్ల గరిష్ఠ స్థాయిని నమోదు చేసింది. నిఫ్టీ 85 పాయింట్లు పెరిగి, 21740కు చేరింది. రెండు సూచీలు ప్రారంభంలోనే లైఫ్ టైం హై రికార్డులను నమోదు చేశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.83.28గా ఉంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో పవర్ గ్రిడ్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఐటీసీ, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడం స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చింది. బుధవారం యూఎస్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు అందించాయి.