Ayodhya Ram mandir design and other details
అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరంలో (Ayodhya Ram Mandir) భగవాన్ శ్రీరాముడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు. ఐదేళ్ళ చిన్నారి రామ్ లల్లా (Ram Lalla) విగ్రహం 51 అంగుళాల పొడవు ఉంటుంది. అలా, ఆలయానికి సంబంధించిన వివరాలను
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (Sriram Janmbhoomi Teerth Kshetra Trust) వెల్లడించింది.
బాలరాముడి విగ్రహాన్ని స్వచ్ఛమైన మక్రానా
చలువరాతితో తయారు చేస్తున్నట్లు ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారు. మొత్తం మూడు
నమూనాలు తయారవుతున్నాయనీ, వాటిలో దైవీకళ ఉట్టిపడే అద్భుత విగ్రహాన్ని గర్భగుడిలో
ఉంచుతారనీ ఆయన వివరించారు.
చంపత్ రాయ్ ఇవాళ మీడియాతో మాట్లాడుతూ
శ్రీరామజన్మభూమి ఆలయం మ్యాప్ (Temple design) ఎలా ఉంటుందో వివరించారు. మొత్తం నిర్మాణంలో 21-22
లక్షల ఘనపుటడుగుల రాతిని వినియోగిస్తున్నారు. ‘‘అంత పెద్ద రాతి నిర్మాణం గత
100-200 ఏళ్ళలో ఉత్తర భారతదేశంలో ఎక్కడా లేదు. దక్షిణభారతంలో కూడా లేదు’’ అని
వెల్లడించారు.
‘‘ఆలయానికి పునాది కోసం ఇంజనీర్లు 56
అంచెల కృత్రిమ రాతిని తయారుచేసారు. నేలమట్టానికి 21 అడుగుల పైవరకూ మొత్తం 17వేల
గ్రానైట్ దిమ్మెలు పరిచారు. వాటిని తెలంగాణ, కర్ణాటకల నుంచి తీసుకొచ్చారు. ఇంక ఆలయ
నిర్మాణానికి రాజస్థాన్‌లోని భరత్పూర్ నుంచి 5లక్షల ఘనపుటడుగుల గులాబి రంగు
శాండ్‌స్టోన్ ఉపయోగించారు. ఇంక మందిరం గర్భగృహం స్వచ్ఛమైన తెల్లని మక్రానా
పాలరాతితో నిర్మించారు. ఆ నిర్మాణం పూర్తయిపోయింది’’ అని చంపత్ రాయ్ చెప్పారు.
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు 2019లో ఇచ్చిన
తుదితీర్పు ప్రకారం హిందువులకు కేటాయించిన 70 ఎకరాల భూమిలో ఉత్తరభాగంలో ఆలయ
నిర్మాణం జరుగుతోంది. ‘‘మొత్తం మూడు అంతస్తుల్లో మందిర నిర్మాణం జరుగుతోంది.
గ్రౌండ్ ఫ్లోర్ పని పూర్తయింది. మొదటి అంతస్తు నిర్మాణం జరుగుతోంది. గుడికి
నాలుగువైపులా సుమారు 750 మీటర్ల పొడవైన ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం వెడల్పు 14
అడుగులు ఉంటుంది. ‘‘ప్రాకారం కూడా రెండు అంతస్తులుగా ఉంటుంది. పై అంతస్తులో
భక్తులు ప్రదక్షిణ చేయవచ్చు. దాని నిర్మాణం జరుగుతోంది. అది పూర్తవడానికి 6-8
నెలలు పడుతుంది’’ అని చంపత్ రాయ్ చెప్పారు.
బాలరాముడిని దర్శించుకోడానికి వచ్చే
భక్తులకు చేసే ఏర్పాట్ల గురించి చంపత్ రాయ్ వివరించారు. ‘‘భక్తుల వసతి కేంద్రం (పిల్గ్రిమేజ్
ఫెసిలిటీ సెంటర్)లో 25వేల మంది భక్తులకు లాకర్ సౌకర్యం కల్పిస్తున్నారు. దానికి
చేరువలోనే ఒక చిన్న ఆస్పత్రి కూడా నిర్మిస్తున్నారు. భక్తుల కోసం టాయిలెట్లు, ఇతర
సౌకర్యాలతో ఒక భారీ కాంప్లెక్స్ నిర్మించారు. ఆ కాంప్లెక్స్ నుంచి వెలువడే వ్యర్ధాలను
ప్రోసెస్ చేయడానికి రెండు సివెర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కూడా నిర్మిస్తున్నారు’’
అని చెప్పారు.
ఇంక ఆలయానికి విద్యుత్ సౌకర్యం నేరుగా పవర్‌హౌస్
నుంచి అందిస్తున్నారు. ‘‘మేము నేరుగా ఒక 33కిలోవాట్ల విద్యుత్ లైన్ కోసం నేరుగా ఒక
లైన్‌ను పవర్ హౌస్ నుంచి తీసుకున్నాము. దాని రిసీవింగ్ స్టేషన్, డిస్ట్రిబ్యూషన్
స్టేషన్లు ఆలయం ఆవరణలోనే నిర్మిస్తాము’’. దీనివల్ల మునిసిపల్ కార్పొరేషన్ మీద
ఎలాంటి ఒత్తిడీ పడదు’’ అని చంపత్ రాయ్ వివరించారు.
అత్యవసర పరిస్థితుల్లో ఫైరింజన్
వినియోగించవలసి వస్తే… దానికి నీరు కావాలి, దానికోసం మందిరం చేరువలో భూగర్భంలో
భారీ నీటి రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. మరీ అవసరమైతే సరయూనది జలాలను
వినియోగిస్తామని చంపత్ రాయ్ చెప్పారు. వాడిన నీరంతా కచ్చితంగా భూమిలోకే వెళ్ళేలా
ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మందిర నిర్మాణం 20 ఎకరాల్లో జరుగుతోంది. అక్కడ మరో
50 ఎకరాల్లో అడవి ఏర్పాటవుతుంది. ఈ చెట్లన్నీ వందల యేళ్ళ నాటివి. అవన్నీ కలిసి
అక్కడ చీమలు దూరని చిట్టడవిని సృష్టిస్తాయి. ఒక్క సూర్యకిరణమైనా చొరబడలేనంత దట్టమైన
అడవిగా అభివృద్ధి చెందుతుంది. దానివల్ల భూగర్భజలాల సమృద్ధిగా పెరుగుతాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శనివారం
అయోధ్యలో విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. రామమందిరం నమూనాలో పునర్నిర్మించిన రైల్వేస్టేషన్‌ను
కూడా ఆరోజే ప్రారంభిస్తారు.