కేంద్రం
ప్రభుత్వ నిధులతో అమలు చేసే పథకాలను కూడా రాష్ట్రప్రభుత్వం తమ సొంతంగా ప్రచారం
చేసుకోవడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. గతంలో టీడీపీ,
ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాలు అదే తరహా పద్ధతి అనుసరిస్తున్నాయని దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వం
పథకాలకు తమ స్టిక్కర్లు వేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.
రాజమహేంద్రవరంలో
పర్యటించిన పురందరేశ్వరి, కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ, మోరంపూడి ఫ్లైఓవర్ పనులు పరిశీలించారు.
రాజమహేంద్రవరంలో
నిర్మాణంలో ఉన్న ఈఎస్ఐ ఆస్పత్రి పనుల పురోగతి గురించి అధికారులను వివరాలు అడిగి
తెలుసుకున్నారు. వంద పడకల ఆస్పత్రిని అధునాతన సాంకేతికత ఉపయోగించి నిర్మిస్తున్నట్లు
అధికారులు, బీజేపీ నేతలకు వివరించారు.
పర్యాటక
ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా రాజమహేంద్రవరం నుంచి లంబసింగి వరకు జాతీయ రహదారి
నిర్మాణం జరుగుతుందని పురందరేశ్వరి అన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తేనే సీఎం జగన్ మోహన్ రెడ్డి
బటన్ నొక్కి జనానికి పంచుతున్నారని విమర్శించారు.
వైసీపీ
పాలన అధ్వాన్నంగా ఉందన్న పురందరేశ్వరి, రాష్ట్రంలో రోడ్లు పూర్తిగా ధ్వంసమైనా మరమ్మతులు
చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళ స్థలాల పేరిట మడ అడవులు ధ్వంసం చేయడం
సరికాదని హితవు పలికారు. వైసీపీ పాలన విధ్వంసంతో ప్రారంభమై అవినీతిలో కూరుకుపోయిందన్నారు.
రాష్ట్రంలో ప్రజాసేవ చేసే అవకాశం బీజేపీకి ఇవ్వాలని ప్రజలను కోరారు.
వైసీపీ
ప్రభుత్వం తీరుతో పేదలకు నాణ్యమైన వైద్యం అందకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ
సేవలు నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు
చేస్తోన్న ఆయుష్మాన్ భవ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో
అమలవుతోందన్నారు. వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా కేంద్రప్రభుత్వం పథకాలను ప్రజలకు
వివరించడంతో పాటు లబ్ధిదారులు ఎంపిక కూడా జరుగుతోందన్నారు.
పర్యటనలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి సాగి కాశీ విశ్వనాథ్ రాజు, జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు పాల్గొన్నారు.