Detained Flight at last
landed in Mumbai
మానవుల అక్రమ రవాణా అనుమానంతో ఫ్రాన్స్‌లో
నిలిపివేసిన విమానం ఎట్టకేలకు భారత్ చేరుకుంది. నాలుగు రోజుల పాటు ఫ్రెంచ్
అధికారుల అదుపులో ఉన్న విమానం ఈ తెల్లవారుజామున సుమారు 4 గంటలకు ముంబై
విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.
దుబాయ్ నుంచి నికరాగ్వా (Dubai to Nicaragua) వెడుతున్న రుమేనియాకు చెందిన లెజెండ్ ఎయిర్‌లైన్స్ విమానం శుక్రవారం
నాడు ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాట్రీ ఎయిర్‌పోర్ట్‌లో
ఇంధనం నింపుకోడం కోసం ఆగింది. అందులో మానవ అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం
అందడంతో విమానాశ్రయ అధికారులు ఆ విమానాన్ని అక్కడే నిలిపివేసారు.(Detained
Flight) అందులో మొత్తం 303 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారిలో 11మంది మైనర్లు ఎవరి తోడూ లేకుండా ఉన్నారు. వారిలో అత్యధికులు భారతీయులే
ఉండడం గమనార్హం.
భారత్‌కు వెనక్కి పంపించిన విమానంలో
276మంది ప్రయాణికులు ఉన్నారని ఫ్రెంచ్ అధికారులు వెల్లడించారు. ఐదుగురు చిన్నారులు
సహా 20మంది మాత్రం ఫ్రాన్స్‌లో ఆశ్రయం కోరడంతో వారిని అక్కడే ఉంచేసారు. ఈ నాలుగు
రోజుల పాటూ మొత్తం ప్రయాణికులందరికీ వాట్రీ ఎయిర్‌పోర్ట్‌లోనే ఆశ్రయం కల్పించారు.
నికరాగ్వా, మధ్య అమెరికాలోని ఓ చిన్న దేశం.
అక్కడికి పెద్దసంఖ్యలో భారతీయులు వెడుతుండడం అనుమానాలకు తావిచ్చింది. నికరాగ్వా
నుంచి అమెరికాలోకి అక్రమంగా వలస వెళ్ళేవాళ్ళు, లేదా అమెరికాలో ఆశ్రయం పొందేవాళ్ళ
సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది. అలాగే అమెరికాలోకి అక్రమంగా చొరబడుతున్న
భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది సుమారు 50వేల మంది భారతీయులు
అక్రమంగా అమెరికాలోకి అడుగుపెడితే, ఈ యేడాది వారి సంఖ్య దాదాపు లక్షకు చేరుకుంది. దాంతో,
ఈ విమానంలోని ప్రయాణికులు నికరాగ్వా మీదుగా అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు
వెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికాలోకి మనుషులను అక్రమంగా రవాణా
చేసే క్రైమ్ సిండికేట్ ఈ దుబాయ్ విమానంలోని ప్రయాణికుల వెనుక ఉండి ఉండొచ్చని అమెరికా
అనుమానిస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంపై ఫ్రాన్స్ దేశపు యాంటీ-ఆర్గనైజ్డ్ క్రైమ్ యూనిట్
‘జునాల్కో’ దర్యాప్తు చేస్తోంది. ఫ్రెంచి చట్టాల ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్‌కు
గరిష్టంగా 20ఏళ్ళ జైలుశిక్ష పడుతుంది.