Veer Bal Diwas : A tribute to the sacrifices of Sikh Children killed by Moguls
ప్రపంచమంతా క్రిస్మస్, న్యూ ఇయర్
హడావుడిలో ఉంటే వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న పంజాబీలు, సిక్కులు మాత్రం నలుగురు
చిన్నారులు చేసిన త్యాగాలను తలచుకుంటూ వారికి నివాళులు అర్పించుకుంటున్నారు.
సిక్కుల పదవ గురువు గురు గోవింద్ సింగ్ (Guru Gobind Singh) నలుగురు కుమారులు ధర్మ పరిరక్షణలో తాముసైతం
అంటూ మొగలుల దురాగతాలకు ప్రాణాలొడ్డారు. 1704 డిసెంబర్ 21 నుంచి 27 తేదీల మధ్యలో ఆ
నలుగురు ధర్మమూర్తులు ధర్మపరిరక్షణలో
అసువులు బాసారు. సిక్కు ధర్మాన్ని అనుసరించేవారందరూ ఆ చిన్నారులకు నివాళులర్పిస్తారు.
గురు గోవిందసింగ్ నలుగురు కుమారులు అజిత్
సింగ్, జుఝార్ సింగ్, జోరావర్ సింగ్, ఫతే సింగ్. వారిని ప్రేమగా చార్ సాహిబ్జాదే (Chaar Saahibjaade) అని పిలుచుకునేవారు. భారత చరిత్రలో వారి త్యాగం శాశ్వతంగా నిలిచిపోయింది. 1704
డిసెంబర్ 20న గురు గోవిందసింగ్, ఆయన భార్య మాతా జీతో, వారి నలుగురు పిల్లలు,
సిక్కు ధర్మంలో పంచపియారాలుగా నిలిచినవారు, ఇంకా పలువురు వీరులు కలిసి ఆనందపూర్
సాహిబ్ కోట నుంచి బయల్దేరారు. వారు అప్పటి మొగలులు ఇచ్చిన హామీని నమ్మారు. మొగలులు
కురాన్ మీద ఒట్టు పెట్టి ఇకపై దాడులు చేయబోమని మాటిచ్చారు.
అయితే మొగలులు తాము ఇచ్చిన మాట తప్పి
మోసం చేసారు. డిసెంబర్ 20 రాత్రి వారు ఆనందపూర్ సాహిబ్‌కు 25 కిలోమీటర్ల దూరంలో
సర్సా అనే చిన్న నది దగ్గర గురుగోవిందసింగ్ బృందం మీద దాడి చేసారు. ఆ
ప్రాంతానికి అనంతర కాలంలో పరివార్ విచోరా
అని పేరు వచ్చింది. అక్కడ కట్టిన సిక్కుల మందిరాన్ని కూడా గురుద్వారా పరివార్
విచోరా సాహిబ్ అని పిలుస్తున్నారు. మొగలుల ఆకస్మిక దాడితో గోవిందసింగ్ బృందం
రెండుగా విడిపోయింది.
గోవిందసింగ్ సోదరుడు మణిసింగ్‌తో ఉన్న
బృందం ఢిల్లీవైపు వెళ్ళింది. డిసెంబర్ 21 మధ్యాహ్నం గురుగోవింద్ సింగ్ చామ్‌కౌర్
వైపు పయనమయ్యాడు. పాంచ్ పియారాలు, 40 మంది సైనికులు, తన కొడుకుల్లో ఇద్దరితో కలిసి
వెళ్తున్నాడు. డిసెంబర్ 22న మొగలుల సైన్యం చామ్‌కౌర్ దగ్గర గోవింద్ సింగ్ బృందం
మీద దాడి చేసారు. ఆ యుద్ధంలో 18, 14 సంవత్సరాల వయసు గల ఇద్దరు కొడుకులూ వీరమరణం
చెందారు. పదివేల మంది సైనికుల మొగలు సైన్యం 40మంది సిక్కు వీరుల్లో కొందరిని,
పాంచ్ పియారాల్లో ముగ్గురిని బలి తీసుకుంది. గోవిందసింగ్ పోలికలతో ఉన్న సంగత్
సింగ్, గురువు వేషంలో కొంతసమయం మొగలుల దృష్టి మళ్ళించగలిగాడు. కానీ మరుసటి రోజు
ఉదయం మిగతా సిక్కువీరులు కూడా హతమయ్యారు.
డిసెంబర్ 21నే గురు గోవిందసింగ్
చిన్నకొడుకులు ఇద్దరూ బాబా జోరావర్ సింగ్ (Baba Zorawar Singh), బాబా ఫతేసింగ్ (Baba Fateh Singh) వాళ్ళ నానమ్మ మాతా గుజ్రీ,
మిగతావారి నుంచి విడిపోయారు. కొద్దిసేపటికే వారు మొగలు సైనికులకు దొరికిపోయారు. జానీ
ఖాన్, మనీ ఖాన్ అనే సర్దార్లు వారిని బంధించారు. అయితే వారెవరు అన్న సంగతి మొగల్
సైన్యానికి ముందు తెలియదు. డిసెంబర్ 22న వాళ్ళు గోవిందసింగ్ పిల్లలు అన్న విషయం
తెలియడంతో, వారిని సర్హింద్ ప్రాంతానికి తరలించారు. అక్కడ కోటలో ఠండా బురీ అనే
బురుజులో నిర్బంధించారు. ఆ మర్నాడు నవాబ్ వజీర్ ఖాన్, అతని సేనాపతి, నవాబ్ షేర్
మహమ్మద్ ఖాన్ ముందు ఆ పిల్లలను ప్రవేశపెట్టారు.
వజీర్ ఖాన్, ఆ ఇద్దరు చిన్నారులనూ ఇస్లాం
మతంలోకి మార్చడానికి ప్రయత్నించాడు. మతం మారితే అంతులేని సంపద ఇస్తానని
ప్రలోభపెట్టాడు. కానీ ఆ సిక్కు వీరబాలలు ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో
వారిని చంపేస్తానని బెదిరించాడు. అయినా వాళ్ళు లొంగలేదు. దాంతో వారికి వజీర్ ఖాన్
వారికి మరణ శిక్ష విధించాడు. అయితే నవాబ్ షేర్ మహమ్మద్ ఖాన్ వజీర్ ఖాన్‌కు
నచ్చజెప్పాడు. వాళ్ళిద్దరూ నిస్సహాయులైన చిన్నపిల్లలనీ, వాళ్ళ ప్రాణాలు తీయవద్దనీ
సూచించాడు. దాంతో వజీర్ ఖాన్ వాళ్ళను మళ్ళీ నిర్బంధంలో ఉంచాడు. కఠోరమైన చలిలో ఆ
పిల్లలు, వారి వృద్ధురాలైన మామ్మ కోట బురుజులో బందీలుగా రెండు రోజులు గడిపారు.
ఆ చిన్నారి పిల్లలు జోరావర్ సింగ్, ఫతే
సింగ్‌ల వయసు 9ఏళ్ళు, 6 ఏళ్ళు. ముక్కుపచ్చలారని పసిబాలురు వారు. ఇస్లాం మతంలోకి
మారకపోతే ప్రాణాలు తీసేస్తామని మొగలులు బెదిరించినా వారు దానికి ఒప్పుకోలేదు. తమ
ఖాల్సాపంథ్కే (సిక్కు ధర్మం) కట్టుబడి ఉంటామని, ప్రాణాలు తీసినా మతం మారే
ప్రసక్తే లేదనీ స్పష్టం చేసారు. మొగలు సైన్యానికి నాయకత్వం వహిస్తున్న వజీర్ ఖాన్
ఆ పిల్లలను చంపేయాలని ఆదేశించాడు. పిల్లలను నించోబెట్టి వారిచుట్టూ ఇటుకలతో గోడ
కట్టేసి సజీవసమాధి చేసేయమని తన సైనికులకు ఆదేశాలు జారీ చేసాడు. అలా 1704 డిసెంబర్
26న ఆ చిన్నారులిద్దరూ అమరవీరులయ్యారు. వాళ్ళ మామ్మ గుజ్రీ కౌర్‌కు ఆ విషయం
తెలియడంతో ఆ బాధ తట్టుకోలేకపోయింది. తన మనవలను సజీవ సమాధి చేసిన మరునాడే ఆమె
ప్రాణాలు విడిచింది.
గురుపుత్రులైన చిన్నారి వీరుల ప్రాణత్యాగాన్ని
సిక్కుధర్మం గుర్తుపెట్టుకుంది. ఆ పిల్లలను సజీవసమాధి చేసిన సర్హింద్ ప్రాంతంలోని
జ్యోతిస్వరూప్ గురుద్వారాకు ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారా అని పేరు మార్చారు. జోరాసింగ్,
ఫతేసింగ్ల సంస్మరణార్థం ప్రతీ యేటా డిసెంబర్ 21 నుంచి 27 వరకూ ఆ గురుద్వారాలో
షహీదీ జోర్ మేళా నిర్వహిస్తున్నారు.
2022 జనవరి 9న
గురుగోవిందసింగ్ జయంతి నాడు నరేంద్రమోదీ ఆ బాలవీరులను స్మరించుకుంటూ వారు అమరులైన
డిసెంబర్ 26ను ప్రతీ యేడాదీ ‘బాలవీర్ దివస్’గా (Bal Veer Diwas) నిర్వహిస్తామని ప్రకటించారు.
అప్పటినుంచీ ఆ చిన్నారి వీరుల త్యాగదినాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా గుర్తించినట్లయింది.