రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) మూడు కొత్త
నేర చట్టాలకు (Three New Criminal Laws) సోమవారం ఆమోదించారు (Approval). దీంతో ఈ చట్టాలు అమల్లోకి వచ్చాయి.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను రాజ్యసభ, లోక్‌సభ ఆమోదించాయి.
వాటికి రాష్ట్రపతి కూడా ఆమోదముద్ర వేయడంతో బిల్లులు చట్టాలుగా అమల్లోకి
వచ్చినట్లయింది.
బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్,
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో భారతీయమైన, ఆధునిక
అవసరాలకు తగినట్లు నవీకరించిన కొత్త చట్టాలను మోదీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ కొత్త చట్టాలను భారతీయ న్యాయసంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023,
భారతీయ సాక్ష్య అధినియమ్ 2023 అని వ్యవహరిస్తారు. (BNS 2023, BNSS 2023, BSA 2023)
మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు,
హత్యానేరాలు, దేశవ్యతిరేకంగా చేపట్టే నేరాల మీద ఈ చట్టాల్లో ప్రత్యేక శ్రద్ధ
వహించారు. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ఈ బిల్లులను
ఆమోదించారు.
ఐపీసీలోని 511 సెక్షన్లకు బదులుగా భారతీయ
న్యాయసంహితలో 358 సెక్షన్లు ఉన్నాయి. 20 కొత్త నేరాలను గుర్తించి ఈ చట్టంలో వాటికి
స్థానం కల్పించారు. 33 నేరాలకు జైలు శిక్ష కాలాన్ని పెంచారు. 83 నేరాలకు జరిమానా
పెంచారు. 23 నేరాలకు కనీస తప్పనిసరి శిక్షాకాలాన్ని ప్రస్తావించారు. 6 నేరాలకు
సామాజికసేవనే శిక్షగా ప్రవేశపెట్టారు. ఐపీసీలోని 19 సెక్షన్లను రద్దు చేయడమో లేక
తొలగించడమో చేసారు.
సీఆర్పీసీలోని 484 సెక్షన్ల స్థానంలో భారతీయ
నాగరిక్ సురక్షా సంహితలో 531 సెక్షన్లు ఉన్నాయి. బిల్లులో 177 అంశాలను మార్చారు, 9
కొత్త సెక్షన్లు, 39 సబ్-సెక్షన్లు కలిపారు. ముసాయిదా చట్టం 44 కొత్త అంశాలు లేదా
వివరణలకు చోటు కల్పించింది. 35 సెక్షన్లకు టైంలైన్లు కలిపారు. 35 చోట్ల ఆడియో-వీడియో
అవకాశం కల్పించారు. 14 సెక్షన్లను రద్దు చేయడమో లేక తొలగించడమో చేసారు.
ఎవిడెన్స్ యాక్ట్‌లోని 167 ప్రొవిజన్లకు
బదులుగా భారతీయ సాక్ష్య అధినియమ్‌లో 170 ప్రొవిజన్లు ఉన్నాయి. 24 ప్రొవిజన్లను
పూర్తిగా మార్చారు. 2 కొత్త ప్రొవిజన్లు, 6 సబ్ ప్రొవిజన్లు చేర్చారు. మరో 6
ప్రొవిజన్లను రద్దు చేసారు లేదా తొలగించారు.