ధనుర్మాస ప్రత్యేక కథాస్రవంతి : 9
మంచి వెన్నెల వేళ :: మణికవాటము తీయవే! –
కాత్యాయనీ వ్రతం –9
రచన : ‘కొత్తావకాయ’ సుస్మిత
************************
నిద్రపోతున్న రేపల్లెలో గిరికీలు కొట్టి
వస్తున్న ఓ పిల్ల తెమ్మెరని యమునమ్మ పలకరించింది. “ఏవిటోయ్.. అంతలా పరిమళాలు
వెదజల్లుతున్నావ్!! ఎచట నుంచి నీ రాక!?”
అల్లరి తెమ్మెర నవ్వుతూ
“ఈ పల్లెలో చీకటి పడగానే వెలిగే సంజె దీపంలాంటి ఇల్లొకటుంది. మా
గొప్పవారిల్లు! ఆ ఇంటికెళ్ళి వస్తున్నాను” అని మహ గర్వంగా చెప్పింది.
“వెళ్ళి చూడలేని దాన్నని తెలుసు కదా! నువ్వేమో
కన్నయ్యలాగే ఎక్కడికైనా వెళ్ళి రాగలిగే సమర్ధత ఉన్న సర్వవ్యాపివి. నన్నూరించకుండా
ఏవిటా పరిమళం.. ఎంత గొప్ప ఇల్లూ.. చెప్పవచ్చు కదా! వింటాను.” అని అడిగింది
యమున.
తెమ్మెర చెప్పడం మొదలుపెట్టింది. “ఆ
ఇంటి గోడలు బంగారు తాపడం చేసి ఉంటాయి. కిటికీలకు మణులు పొదగబడి ఉంటాయి. ఆ ఇల్లు
కుబేరుని సౌధంలా అణువణువునా ఐశ్వర్యంతో మెరిసిపడుతూ ఉంటుంది. ఆ ఇంటి వాకిట్లో వెండి
గిన్నెలూ, బంగారపు పళ్ళెరాలతో పక్షులకు నీళ్ళు, నూకలు పెడతారు.
ఆ ఇంటికి మరకతమణులూ, నీలాలూ పొదిగిన కవాటమొకటి.. దక్షిణపు గాలి ధారాళంగా వచ్చేలా ఉంది.
నేను ఎప్పుడూ ఆ దారంటే ఆ ఇంటికి వెళ్ళొస్తాను.”
“ఊ.. ఎవరుంటారా గదిలో!?” ఆసక్తిగా
అడిగిని యమున.
“నేను దేశదేశాలు తిరిగానా..! ఎంతో మంది ధనికుల
ఖజానాల్లో తారట్లాడానా..! కొండల లోయల్లోంచి గరుడపక్షుల ఆహారానికి అంటుకుని
కొండచరియల్లో విడిచిపెట్టబడి, ఎండకి మెరిసే పెద్ద పెద్ద వజ్రాలను చూసానా? ఎక్కడా చూడని ఓ అద్భుతమైన రత్నం ఆ గదిలో ఉంది.”
“అవునా! ఏవిటా రత్నం? వైఢూర్యమా? మరకతమా? నీలమా?”
“అలా ఒక రంగులో మెరిసే రాయి కాదు. నిత్యం కృష్ణనామ
సంకీర్తన చేస్తూ అద్భుత తేజస్సుతో మిలమిలలాడే రత్నం!”
“అబ్బా.. చెప్దూ! మాట్లాడే మాణిక్యమా!!”
“అవును! కృష్ణ లీలలే ఉగ్గుపాలుగా పోసి, కృష్ణుడి తలపే
పాలబువ్వలుగా, పంచభక్ష్యాలుగా కొసరికొసరి తినిపిస్తూ ఆ ఇంటి యజమానురాలు
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న గారాలపట్టి… మంజుల!”
“ఓ… మంజులా!! నాకెందుకు తెలియదు! కాత్యాయనీ
వ్రతానికి రోజూ వస్తుంది కదా!”
“అవును. ఆ మంజులే! నీ ఒడ్డున వాళ్ళాడిన ఆటలూ, పాటలూ, నీ చల్లని తరగల్లో
ఆడిన తానాలే చూసావు నువ్వు. ఆ పిల్ల ఎంత భాగ్యవంతుల బిడ్డో నీకు తెలియదు.”
“ఎంత భాగ్యశాలికైనా అసలుసిసలు ఐశ్వర్యం
కన్నయ్యే కదా!”
“అవుననుకో! అలా అయినా గొప్ప ధనవంతుల ఇల్లది! నీకు
తెలియని సంగతొకటి చెప్తాను విను. మంజుల ప్రతి రేయీ తన గది ఎంత అందంగా
అలంకరిస్తుందో తెలుసా!”
“అవునా! ఎందుకూ?”
“ఎందుకంటావేమిటీ! “ఏ క్షణంలో కన్నయ్య
ఎదురుపడతాడో!” అని ఆ గొల్లపిల్లలందరూ అనుక్షణం ముస్తాబు చేసుకుని కడిగిన
ముత్యాల్లా ఉండరూ! అలాగే
“ఏ వేళలో కన్నయ్య వస్తాడో!” అని తన గదిని
మంజుల అలాగే అలంకరించుకుని ఉంచుకుంటుంది.”
“వాసక సజ్జిక!”
“అవును. గోమేధికాలు, గరుడ పచ్చలూ
పొదిగిన బంగారు ప్రమిదెల్లో, పరిమళాలు వెదజల్లే నూనె పోసి దివ్వెలు వెలిగిస్తుంది. దంతపు కట్టున్న
చక్కటి అద్దాలు బిగించిన ఆ గది గోడలు,
ఆ దీపాల వెలుగును పదింతలు చేస్తూ ఉంటాయి.”
“ఆహా!”
“అంతేనా..!! బహు చక్కని లతల చెక్కడపు వెండి పన్నీరు
బుడ్డి, నిత్యం పన్నీరు నింపుకుని అతని కోసం సిధ్ధంగా ఉంటుంది. మేలు చందనపు
చెక్క పన్నీట అరగదీసిన గంధం మరో వెండిగిన్నెలో సువాసనలు వెదజల్లుతూ ఉంటుంది.
“ఆహా.. విత్తం కొద్దీ వైభవం కదా!”
“ఈ మాత్రానికేనా! లేలేత తమలపాకులూ, పచ్చకర్పూరం, కుంకుమపువ్వు, యాలకులు, లవంగాలూ తదితర
ద్రవ్యాలూ, పోక చెక్కలూ.. ఓ ముద్దులొలికిలే బంగారు పళ్ళెంలో ఆ శయ్య పక్కనే
ఎదురుచూస్తూ ఉంటాయి. శయ్య అంటే మామూలు తల్పమనుకునేవు! ఆ పన్నగపు శయ్యపై పరుండే
స్వామికి, శేషతల్పానికి దీటైన పరుపు ఉండద్దూ! సౌఖ్యమైన హంసతూలికా తల్పం.. చక్కని
పట్టు తలగడలూ.. పాలతరగల మేలుకట్టు, మిసమిసలాడే పల్చని తెరలు!!
చమరీ మృగాల కేశాలతో తయారు చేసిన చామరాలు..
వింజామరలు!!”
“ఆహా.. భోగ నారాయణుడికి ఆ మాత్రం ఉండద్దూ!
భేష్!!”
“ఆ గదిలో సుడులు తిరుగుతూ దివ్యపరిమళాలు వెదజల్లే
అగరుధూపం క్షణమైనా విశ్రమించదంటే నమ్మాలి నువ్వు!”
“అబ్బ! ఇంత భోగ్యమైన పడకటిల్లు వదిలి కృష్ణుడు
ఇంకెక్కడికి పోతాడూ!? నిత్యం మంజుల కౌగిట్లో బందీయై ఆ సౌధం దాటి రాడేమో!”
“అన్నావూ..! గోపికలందరికీ అదే అనుమానం. ఇందాకా
“కృష్ణా.. కృష్ణా!” అని పలవరిస్తూ మంజుల కలలో తేలుతోందా! బయట గుమ్మం
దగ్గర నిలబడిన గోపికలందరూ అదే అనుకుంటున్నారు! ఎంత పిలిచినా మేలుకోవడం లేదంటే ఆమె
ఇంట్లో కన్నయ్య ఉన్నాడేమో! కన్నయ్యే తన చెంత ఉంటే ఇంక వేరే వ్రతాలెందుకని ఆ
భాగ్యశాలి తలుపుతీయట్లేదేమో!” అని అనుమానపడుతున్నారు.”
“నిజమా!!” ఆశ్చర్యపోయింది యమున.
“అవును.. నిన్న రాత్రి ఆ ఇంట్లోకి వెళ్ళాను.
నేనిలా లోపలికి వెళ్ళానా.. ఆ అమ్మాయి కవాటం బిగించేసింది. చేసేదేముందని ఆ మందిర
సౌందర్యాన్ని చూస్తూ, అగరుపొగలతో ముచ్చట్లాడుతూ రాత్రంతా గడిపేసాను. ఆ పక్క గదిలోనే
వాళ్ళమ్మ కూడా ఉంది. ఆ గది కిటికీ తెరచి ఉండడం గమనించి, తెల్లారబోతోంది కదా
అని బయటికి వచ్చాను. రాత్రంతా మంజుల గదిలో తారట్లాడనేమో.. నా ఒళ్ళంతా ఆ అగరు సుగంధం
పట్టేసింది.” చెప్పుకొచ్చింది తెమ్మెర.
“సరిపోయింది! ఇంతకీ నిజంగానే ఆ గదిలో కృష్ణుడు
లేడా?” అనుమానంగా అడిగింది యమున.
“హు.. కన్నయ్య లేనిదెక్కడని! ఆ పిల్ల రాత్రి
ఊపిరెన్నిసార్లు తీసిందో అన్ని సార్లూ “కృష్ణా.. కృష్ణా..!” అంటూనే
ఉంది!”
“అయితే కలలోనే ఉన్నాడనమాట కన్నయ్య!పాపం, ఆ పిల్ల నిద్ర
లేవడం లేదని చెలులు ఎన్ని అభాండాలు వేసి మాటలాడుతున్నారో! అసూయ, అనుమానం మహ చెడ్డవి
కదూ! కబుర్లు చాల్లే కానీ.. ఇదిగో! చప్పున వెళ్ళి అక్కడేం జరుగుతోందో చూసి
రా!” పురమాయించింది.
“రాత్రంతా మంజుల నిట్టూర్పుల చండ్రగాలుల్లో మరిగి
ఉన్నాను. ఒక్క స్నానం చేసి వెళ్ళనిద్దూ!”
“స్నానం చేసి వెళ్ళే సమయం లేదు. వెళ్ళు వెళ్ళు..
చెలులతో కలిసి తీరిగ్గా జలకాలాడుదువు గాని! వెళ్ళి చూసి రా.. ఇక్కడున్నట్టు
వెళ్ళి రావాలి తెలిసిందా!!” తరిమింది యమునమ్మ.
తప్పేదేముందని మంజుల ఇంటివైపు పరుగులు తీసింది
పిల్ల తెమ్మెర.
“ఓ మంజులా! నిన్ను పిలిచీ పిలిచీ మా గొంతు జీరబోతోంది. లేమ్మా..!
నీలాంటి గొప్ప ధనవంతురాలు మాతో కలిసి వ్రతం చెయ్యడమే గొప్పని మురిసిపోతున్నాం.
అంతస్థులో నీతో సమానమైన వాళ్ళమేం కాదు కానీ, ఏదో.. నువ్వు మా మేనమామ కూతురివి కదా.. ఆ చనువుతో
నీతో కలిసి తిరుగుతున్నాం.” పిలుస్తోంది కమలిని. ఆ బంగారు వాకిలి ముందు
పడిగాపులు కాస్తున్నారు మిగిలిన చెలులందరూ. అటు వెళ్ళిన పిల్ల తెమ్మెర అక్కడే
తారట్లాడుతూ వింత చూస్తోంది.
“ఈ పిల్ల అంత చక్కని శయ్యమీద నిద్దరోతే ఆ
సౌఖ్యానికి తెలివేం వస్తుంది! నిద్ర లేస్తున్న పక్షులతో సమానంగా ఇంత సేపటి నుంచీ పిలుస్తున్నాం.
మంజులకి వినబడలేదు సరే! కనీసం అత్తకైనా వినబడలేదంటావా!?” వాపోయింది
సురభి.
“పోనీ ముందు అత్తనే పిలుద్దాం. అత్తా.. లే లే!! నీ
ముద్దుల కూతుర్ని నిద్ర లేపి ‘కాత్యాయనీ వ్రతానికి‘ పంపించు. స్నానానికి వేళ మించిపోతోంది. పెద్ద దానివి! అన్నీ తెలిసిన
దానివి! కనీసం నీకైనా తెల్లవారుఝామున తెలివి రానంతగా మొద్దు నిద్ర
పట్టేసిందా!” పిలిచింది కమలిని.
“ఓ అత్తా! నీ చిన్నారి నిజంగానే నిద్రపోతోందా? లేక కృష్ణుడే ఆ
గదిలో ఉన్నాడని, సడి లేకుండా ఆ మోహనాకారుడిని చూస్తూ మూగదైపోయిందా!”
“కనీసం పిలుపైనా వినిపించని చెవిటిదా? కిటికీ తలుపు
తెరిచి “మీరెళ్ళండర్రా.. మీతో రావాల్సిన అవసరం నాకేంటి!” అని మమ్మల్ని
పంపించేయచ్చు కదా!” నిష్టూరమాడింది సురభి.
“అత్తా.. పోనీ.. కన్నయ్య ఆ గదిలో లేడనుకో!
కలలో “కృష్ణా కృష్ణా!” అని జపం చేస్తున్న నీ కూతురికి తపోభంగం కాకుండా, నువ్వే కావలి ఉండి
నిద్ర లేవకుండా చూసుకుంటున్నావా, ఏం?”
“మీ ఇద్దరికీ గాఢనిద్రామంత్రమేమైనా ఎవరైనా వేసారా?” తనవంతు
ఇంకొన్ని మాటల బాణాలు వేసింది ఉత్పల.
ఇలా చెలులు అంటున్న మాటలని వారించింది
ఆనందిని. “ఆగడాగండి అమ్మాయిలూ!! ఈ రేపల్లెలో ‘అందరికీ సమానమైన
సొత్తు‘ కృష్ణుడని మీకు తెలీదూ! అయినా అత్తమ్మ మంజులని ఎలా పెంచిందో మనం
చూడలేదూ! తన ఐశ్వర్యాన్ని చూసి కృష్ణుడు వస్తాడని భ్రమ పడేంత తెలివి తక్కువదా ఆ
పిల్ల! తప్పు..తప్పు! గాఢ నిద్రామంత్రమేసినారో! అని నిష్టూరాలాడుతున్నారు కదా!
నిజమే! కృష్ణుడే ఆ మంత్రం!
సర్వైశ్వర్యైకమంత్రం వ్యసనభుజగ సందష్ట సంత్రాణమంత్రం
జిహ్వే శ్రీకృష్ణమంత్రం జపజప సతతం
జన్మసాఫల్యమంత్రం
అన్నింటికంటే గొప్ప
మంత్రం కన్నయ్య పేరు తలవడమే! ఆ పేరు తలచీ తలచీ మత్తులో మునిగిపోయిందా పిల్ల.
విత్తొకటేస్తే చెట్టొకటి రాదు కదా! ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుంది. అత్తమ్మ
నేర్పిన పలుకులే పలుకుతోంది మంజుల. ఏవైనా మంచి కబుర్లు చెప్పి నిద్ర లేపక
నిష్టూరాలతో లేపుతామా?” అందరినీ శాంతింపచేసింది ఆనందిని.
మనవి వినవే! మామ కూతుర!
మణికవాటము తీయవే!
మణిఖచిత సౌధమ్ములో పరి
మళపు దివ్వెల వెలుగులో,
నునుతలిమమున కనులు మొగిడిచి
కునుకుదువుగానీ! లేవే!
మూకయో! చెవిటిదో! అత్తా!
ముద్దులా చిన్నారి కూతురు!
కాక కావలి కదలనీయరొ?
గాఢనిద్రామంత్రమేసిరొ
“శ్రీకరా! వైకుంఠనాధా!
మాధవా! మాయావి! హరి!”యని
నీకుమార్తెను లేపుమా, శుభ
నామపారాయణమ్ముతో!
బయట ఆ “కల్యాణు‘ల మేల్కొలుపు విని
కళ్ళు విప్పింది వాళ్ళ అత్తమ్మ. కూతురిని “మాధవా! కృష్ణా!” అని పిలుస్తూ
నిద్ర లేపుదామని వెళ్ళబోతూ ఉండగా, ఆమెకి బయట నుంచి మాటలు వినిపిస్తున్నాయిలా..
“అత్తా! నీవెరుగని విషయమేముంది! నీ కూతురిలాగే గోపస్త్రీలందరమూ
కృష్ణుని ముఖచంద్రబింబం కోసం చకోరాల్లా ఎదురుచూస్తున్న వాళ్ళమే! విరహపు వేడి సెగలో, వేడి నిట్టూర్పు
గాడ్పుల్లో వేగి వేసారుతున్న వాళ్ళమే! ఈ తాపానికి, కన్నయ్యని పొందాలనే
మా సంకల్పానికీ యమునలో మునకను మించిన ఉపశమనమేముంది, తరుణోపాయమేముంది?”
“అడవిలో ఆలమందలను కబళించిన దావాగ్నిని కన్నయ్య
అమాంతం మింగినట్టు, ఆ యమున మా తాపాన్ని చల్లార్చితే బాగుండును!” దిగులుగా చెప్పింది
ఉత్పల.
“నీ కూతురు మహా భాగ్యశాలి. గోపాల చూడామణిని నిత్యం
తన గుండెలపై ధరిస్తుంది. కృష్ణ మంత్రాన్ని క్షణమైనా మరువదు. ఆమెను తో కలిసి వ్రతం
పూర్తి చేస్తేనే మా నోము పండుతుంది.”
చిరుగంటలు ఘల్లుమని మ్రోగుతూ
బంగారువాకిలి తెరుచుకుంది. శేషతల్పం దిగివచ్చిన సిరిలా వెలుగుల నవ్వులు వెదజల్లుతూ
బయటకు నడిచి వచ్చింది మంజుల. ‘కాత్యాయని పూజ‘కు కదిలివెళ్ళారందరూ!
(ఇంకొన్ని కబుర్లు రేపు)
(ఆండాళ్ “తిరుప్పావై” పాశురాలకు, దేవులపల్లి
కృష్ణశాస్త్రి గారి తేనె తీయని తెనుగు సేత)
(ఆండాళ్ “తిరుప్పావై”, బమ్మెర పోతనామాత్య
ప్రణీత “శ్రీమదాంధ్ర భాగవతము”, పిలకా గణపతి శాస్త్రి గారి “హరి వంశము”
ఆధారంగా.. తగుమాత్రం కల్పన జోడించి..)