Christmas and New Year
are disastrous celebrations
ఆంగ్లసంవత్సరం చివరికి వస్తే చాలు, డిసెంబర్
రెండోవారం దాటిందంటే చాలు, క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల (Christmas and New Year Celebrations) కోసం సన్నాహాలు మొదలైపోతాయి. క్రైస్తవంతో సంబంధం లేకపోయినా భారతదేశంలో
దాదాపు ప్రతీ ఊళ్ళోనూ క్రిస్మస్ స్టార్స్, క్రిస్మస్ ట్రీస్, కొవ్వొత్తులు,
కేకులు, బాణాసంచా హంగామా మొదలైపోతుంది. ఇంక క్రీస్తు పుట్టినరోజుగా చెప్పబడే డిసెంబర్
25 సమీపించేకొద్దీ వాతావరణం మారిపోతుంది. క్రిస్మస్ ఈవ్ రోజు నుంచే మార్కెట్లన్నీ లైట్లతో
వెలిగిపోతుంటాయి. దుకాణదారులు కస్టమర్లని ఆకర్షించడానికి రకరకాల స్కీములు
ప్రకటించేస్తారు. ఇంక సంవత్సరం ఆఖరి రోజు టీవీ ఛానెళ్ళన్నీ ఆస్ట్రేలియా నుంచి
మొదలుపెట్టి అమెరికా వరకూ ప్రపంచం అంతా బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకునే
దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసేస్తాయి. ఇంక డిసెంబర్ 31న మందు కొట్టి పార్టీ
చేసుకోవడమే కల్చర్‌గా మారిపోయింది. కానీ మనం భారతీయులం క్రిస్మస్, న్యూ ఇయర్
వేడుకలు ఎందుకు చేసుకుంటాం? దానికి ఏదైనా సాంస్కృతిక లేదా పర్యావరణ సంబంధమైన
ప్రాధాన్యత ఉందా? ఏదైనా వైజ్ఞానిక దృక్పథంతో తరతరాలుగా మానవాళి ఈ పండుగలు
జరుపుకుంటోందా? ఈ రెండు సందర్భాల్లోనూ జరిగే వేడుకలు చూస్తే ఎన్నో ప్రశ్నలు
తలెత్తుతాయి.
అసలు, జనవరి 1న కొత్తసంవత్సరంగా జరుపుకోవడం
అన్న పద్ధతి ఈమధ్య మొదలైనదే అన్న విషయం తెలుస్తే నేటి యువతరం కచ్చితంగా ఆశ్చర్యపోతుంది.
18వ శతాబ్దపు ద్వితీయార్థం వరకూ జనవరి 1 కొత్తసంవత్సరం కాదు. ఇంగ్లండ్, అమెరికా
సైతం మార్చి 25నే నూతన సంవత్సర వేడుకలు చేసుకునేవి. సామాన్య పూర్వ శకం 43లో రోమన్
రాజు నుమా పాంపిలస్ తమ దేశపు క్యాలెండర్‌ను సవరించాడు. అంతవరకూ మొదటి నెలగా ఉన్న
మార్చిని మార్చి, జనవరిని సంవత్సరపు ప్రారంభ మాసంగా చేసాడు. రోమన్లకు అన్ని సందర్బాలకూ
ప్రారంభదేవత అయిన జానస్ పేరు మీద జనవరి నెలను మొదటి మాసంగా మార్చాడు. ఏడాదికి మొదట
మార్చి ఉండేది. సెప్టెంబర్ (ఏడు) నుంచి డిసెంబర్ (పది) వరకూ ఉన్న మాసాల పేర్లు
కూడా దాన్నే సూచిస్తాయి. జనవరిని మొదటి నెల చేసాక కూడా లీపు సంవత్సరాల తప్పుడు
లెక్కలు కొనసాగుతూనే ఉండేవి. సామాన్య పూర్వ శకం1582లో పోప్ గ్రెగరీ 13 క్యాలెండర్‌ను (Gregorian Calender) మళ్ళీ సవరించాడు. జనవరి 1ని సంవత్సరం మొదటిరోజుగా పెట్టి, లీపు సంవత్సరం
లెక్క కోసం ఫిబ్రవరిలో రోజుల పద్ధతిని అమర్చాడు. ఆ కొత్త సంవత్సరపు పద్ధతిని
గ్రేట్ బ్రిటన్ లాంటి ప్రొటెస్టంట్ దేశాలు 1752 వరకూ అంగీకరించలేదు. అలా, మొత్తం
గ్రెగోరియన్ క్యాలెండర్ అనేది చర్చి చేసిన ట్రయల్ అండ్ ఎర్రర్ ప్రయోగాల ఫలితమే. ఆ
కొత్త క్యాలెండర్‌ను అమల్లోకి తెచ్చే క్రమంలో జీసస్ క్రైస్ట్ పుట్టినరోజుగా
డిసెంబర్ 25ను ప్రకటించింది కూడా చర్చే.
రోమన్ల పరిపాలనా కాలంలో క్రిస్మస్, కొత్త
సంవత్సరం కుటుంబపరమైన పండుగల వ్యవహారంగానే ఉండేవి. వాటికి కొంతవరకూ మతపరమైన
ప్రాధాన్యత ఉండేది. తర్వాత యూరోపియన్ల కాలనైజేషన్ ఆ స్ఫూర్తి మొత్తాన్నీ చెడగొట్టేసింది.
వ్యక్తిగత వస్తువాదం, లాభాపేక్ష తప్ప మరేమీ పట్టని క్యాపిటలిస్టు పద్ధతుల
బుర్రతక్కువ కలయిక, ఆ పండుగల అస్తిత్వాన్నే చంపేసింది. క్రిస్మస్ను అమెరికన్
పద్ధతుల్లోకి మార్చేయడమూ దీనికి ప్రధాన కారణం. ఇంక శాంటాక్లాజ్ అనే కల్పితపాత్ర(Imaginary
Santa Clause) వెనుక కోకా కోలా వ్యాపార లాభాపేక్ష ప్రభావం తెలిసిందే.
చరిత్రలోని నిజమైన సెయింట్ నికొలాస్ వ్యక్తిత్వంలో ప్రేమించే గుణం, కానుకలిచ్చే
గుణం లేనేలేవు. బాక్సింగ్ డే, కానుకలివ్వడం, కొనుగోళ్ళు ఇవన్నీ వివిధ ఉత్పత్తుల
బ్రాండ్ల మార్కెటింగ్ టెక్నిక్‌లు. ప్రపంచీకరణ తరువాతి మార్కెట్ ఎకానమీలో ఈ
వ్యాపారం మరింతగా వర్ధిల్లుతోంది. కాబట్టే… చర్చి సృష్టించిన, పెట్టుబడిదారీ
విధానం పెంచిపోషించిన ఈ పండుగలు కలిగిస్తున్న పర్యావరణ వినాశనాన్ని అధ్యయనం
చేయడానికి మార్కెట్ శక్తులు నిధులు సమకూర్చవు. పెట్టుబడిదారీ విధానం పేరిట పాటించే
పద్ధతులన్నీ నిజానికి ప్రొటెస్టంట్ పద్ధతులే. అందుకే, పర్యావరణం పేరిట పాగన్ మతాల
(ప్రకృతి ఆరాధనా విధానాల) పండుగలను (Pagan
Religious Festivals) లక్ష్యం చేసుకుని,
వాటిని రూపుమాపారు. వాటి స్థానంలో క్రిస్మస్, న్యూ ఇయర్లను చొప్పించారు.
భారతదేశంలో కొత్త సంవత్సరాన్ని జరుపుకునే
పద్ధతులు చాలా ఉన్నాయి. స్థానిక ఆచార వ్యవహారాలను బట్టి, వ్యవసాయ ఋతువులను బట్టి
సంవత్సరాది వేడుకలు జరుపుకుంటారు. భారతీయ పండుగలకు కొంతవరకూ మతపరమైన ప్రాధాన్యత ఉన్నప్పటికీ,
లేదా వాటికి ఏదైనా చారిత్రక లేదా పౌరాణిక నేపథ్యం ఉన్నప్పటికీ, అవి ఏదో ఒకరకంగా
వైజ్ఞానిక అవగాహన కలిగి ఉంటాయి. మన దేశంలో వేల యేళ్ళుగా కాల గణన కోసం పంచాంగాలను
అనుసరిస్తున్నాము. అనంతమైన వైవిధ్యం కలిగిన భారతీయ సంస్కృతికి మరికొన్ని పండుగలో,
మరికొన్ని పాత్రలో వచ్చి కలిసినంత మాత్రాన మన సంప్రదాయాల విలువ ఏమాత్రం తగ్గిపోదు.
మన మౌలికమైన విలువల విశ్వజనీనమైనవి. వాటిమీద చర్చి తన ఆంగ్లోశాక్సన్ విలువలను బలవంతంగా
రుద్దింది. నిజానికి సరిగ్గా ఆ బలవంతపు రుద్దుడు వల్లనే ఇజ్రాయెల్ వంటి దేశాలు ఈ
యూరోపియన్-అమెరికన్ పండుగలు, వేడుకలను దూరం పెట్టాయి. తమవైన జాతీయ పండుగల
అస్తిత్వాన్ని బలోపేతం చేసుకున్నాయి. కొంతవరకూ చైనా కూడా అదే పద్ధతి అనుసరిస్తోంది.
పర్యావరణాన్ని విధ్వంసం చేసే క్రిస్మస్, న్యూఇయర్ వంటి పండుగలను గుడ్డిగా అనుకరించడం,
సొంతం చేసుకోవడాన్ని మాని మనం ఈ వేడుకల మూలాలు, తాత్వికత, చారిత్రకత గురించి
ఆలోచించాలి. మన సంస్కృతి మీద, పర్యావరణం మీద అవి చూపించే దుష్ప్రభావాన్ని అర్ధం
చేసుకోవాలి.