Why December 25 is celebrated as Birthday of Jesus Christ, which is not?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులలో
అత్యధికులు డిసెంబర్ 25ను ఏసుక్రీస్తు (Jesus Christ) పుట్టినరోజుగా జరుపుకుంటారు. అసలు
ఏసుక్రీస్తు అనే వ్యక్తి నిజంగా చరిత్రలో ఉండేవాడా అన్న సందేహాలను కాసేపు పక్కన
పెడితే, బైబిల్లో సూచించిన ప్రకారం చూసినా డిసెంబర్ 25న అతను పుట్టలేదని క్రైస్తవ
పరిశోధకులే చాలామంది స్పష్టం చేసారు. మరి అలాంటప్పుడు ఈరోజును క్రీస్తు పుట్టినరోజుగా (Christmas) క్రైస్తవులు ఎందుకు జరుపుకుంటారు?
ఏసుక్రీస్తు పుట్టిన రోజు ఎవరికీ తెలియదు
:
జీసస్ పుట్టిన రోజు ఎప్పుడనే విషయం మీద
ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సందేహాలూ ఉన్నాయి. అసలు ఏసుక్రీస్తు ఎప్పుడు
పుట్టాడు అనే విషయం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి. కానీ సరైన తేదీ ఎవరూ
కనుగొనలేకపోయారు. బైబిల్ (Bible) ఆధారంగా అత్యధికులు విశ్వసించే విషయం ఏంటంటే ఏసుక్రీస్తు
వేసవికాలంలో పుట్టాడు. (Christ born in Summer) అలాంటప్పుడు డిసెంబర్ 25నాడు ఎందుకు జీసస్ జన్మదినాన్ని
పాటిస్తారు?
డిసెంబర్ 25 ‘బిగ్ డే’ :
క్రీస్తు జననం గురించి పరిశోధించిన
అత్యధికులు, ఈ తేదీని రోమన్ క్యాథలిక్ చర్చ్ ‘బిగ్ డే’గా ఎంచుకుంది అనే నిర్ణయానికి
వచ్చారు. ఈ తేదీ దక్షిణాయనంలో (Winter Solstice) వస్తుంది. డిసెంబర్ 25 భూమి ఉత్తరార్థగోళంలో అతి చిన్న
రోజు. ఆ మరునాటి నుంచీ పగటి వేళ క్రమంగా పెరుగుతూ ఉంటుంది. రోమన్ సంస్కృతిలో ఈ
రోజుకు ప్రాధాన్యముంది. డిసెంబర్ 25న రోమన్లు ‘శాటర్నాలియా’ అనే పండుగ (Roman Festival Saturnalia) చేసుకుంటారు. అది వారి దేవతల్లో శనిదేవుడికి సంబంధించిన పండుగ.
చర్చి ఎంచుకున్న జన్మదినం :
రోమన్లు డిసెంబర్ 25న శనిదేవుడి పండుగ జరుపుకునేవారు.
అదే రోజు, ఐరోపాలోని క్రైస్తవేతరులు సూర్యుడి పుట్టినరోజు జరుపుకునేవారు. శీతాకాలంలో
సూర్యుడి వేడిమి తగ్గుతుంది కాబట్టి, సూర్యుడు మళ్ళీ తిరిగి రావడం కోసం
ప్రార్థించేవారు. ఆరోజు సూర్యుడు తిరుగుప్రయాణం మొదలుపెడతాడని వారి విశ్వాసం. అందుకే
క్రైస్తవ మతాన్ని వ్యాపింపజేయడానికి, ఇతరుల పండుగ రోజును చర్చి తమ మతంలోకి లాక్కుంది.
ఆ రోజును ఏసుక్రీస్తు పుట్టినరోజుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకుంది. (Church selected the day)
ఈస్టర్ తర్వాత తొమ్మిది నెలలకు :
క్రైస్తవుల విశ్వాసం ప్రకారం ఏసుక్రీస్తు
తన తల్లి కడుపులో ఈస్టర్ పండుగ రోజు పడ్డాడు. ఆ తర్వాత తొమ్మిది నెలలకు ఈ
భూమిమీదకు వచ్చాడు. మేరీ గర్భధారణ జరిగినది మార్చి 25న అని రోమన్లు సహా పలువురి
విశ్వాసం. అయితే గ్రీకు క్యాలెండర్ ప్రకారం ఆమె ఏప్రిల్ 6న గర్భం ధరించింది. అలా,
చరిత్రలో ఏసుక్రీస్తు పుట్టిన తేదీ చాలాసార్లే మారింది.
ఏదేమైనా, మొదట్లో క్రిస్మస్ను జనవరి నెలలోనే
జరుపుకునేవారు. అది క్రమంగా డిసెంబర్లోకి వచ్చి నిలబడింది. ఇప్పటికి కూడా
క్యాథలిక్, ప్రొటెస్టెంట్ సంప్రదాయాల క్రైస్తవులు ఏసుక్రీస్తు పుట్టినరోజును
డిసెంబర్ 25న జరుపుకుంటారు కానీ రష్యా, ఈజిప్ట్, గ్రీస్ వంటి దేశాలలోని సంప్రదాయ
క్రైస్తవులు (Orthodox Christians) ఏసు పుట్టినరోజును జనవరి 6 లేదా 7 తేదీలో జరుపుకోవడాన్ని మనం గమనించవచ్చు.
అలా, నిజంగా పుట్టాడో లేడో సరైన చారిత్రక
ఆధారాలు లేని ఏసుక్రీస్తు పుట్టినరోజును డిసెంబర్ 25గా క్రైస్తవ చర్చి నిర్ణయించింది.
ఆ దినాన్నే ఎక్కువశాతం మంది క్రైస్తవులు అనుసరించేస్తున్నారు.