Sports Ministry suspends wrestling federation
కేంద్రప్రభుత్వం
కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) పాలకవర్గాన్ని రద్దు చేస్తున్నట్లు
భారత క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డబ్ల్యూఎఫ్ఐ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన
సంజయ్ కుమార్ సింగ్, సమాఖ్య నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే ఈ నిర్ణయాన్ని
కేంద్రం తీసుకుంది.
అండర్-15,
అండర్-20 రెజ్లింగ్ పోటీలను ఉత్తర ప్రదేశ్ లోని గోండ్ జిల్లా పరిధిలోని నంధిని
నగర్ లో నిర్వహిస్తామని సంజయ్ సింగ్ ప్రకటించడాన్ని తొందరపాటు చర్యగా క్రీడా శాఖ
పేర్కొంది. ముందస్తు నోటీసులు జారీ
చేయకుండా WFI నిబంధనలకు వ్యతిరేకంగా ప్రకటన
చేసినందుకుగాను సమాఖ్యను రద్దు చేసినట్లు వెల్లడించింది.
డబ్ల్యూఎఫ్ఐ
రాజ్యాంగంలోని క్లాజ్-3(E) ప్రకారం సీనియర్, జూనియర్, సబ్
జూనియర్ నేషనల్ చాంపియన్స్షిప్ప్ ఎక్కడ నిర్వహించాలనే అంశాన్ని ఎగ్జిక్యూటివ్
కమిటీ నిర్ణయిస్తుందన్నారు.
ఆర్టికల్
11 ప్రకారం, సమావేశం నిర్వహణకు ముందుగా నోటీసులు జారీ చేయాలి. ఇందుకు కనీసం 15
రోజుల నోటీసు పీరియడ్ ఉంటుంది. మొత్తం ప్రతినిధుల్లో మూడొంతుల్లో ఒక వంతు మేర కోరం
ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి.
అత్యవసరంగా
సమావేశం నిర్వహించాలనుకుంటే 7 రోజుల ముందు నోటీసు ఇవ్వడంతో పాటు కనీస కోరం 1/3వ
వంతు ఉండాలి.
ఆర్టికల్10(D) ప్రకారం, సమాఖ్య ప్రధాన కార్యదర్శి
సమావేశం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంతో పాటు మినిట్స్ నమోదు చేయాలి,
అలాగే నివేదికలను తయారు చేయాల్సి ఉంటుందని అందుకు తగ్గట్టుగా వ్యవహరించకపోవడంతోనే
చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని క్రీడా శాఖ తెలిపింది.
బ్రిజ్
భూషణ్ అనుచరుడు, వ్యాపార భాగస్వామి అయిన సంజయ్ సింగ్ రెజ్లింగ్ సమాఖ్య నూతన
అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై స్టార్
రెజ్లర్ సాక్షి మాలిక్ నిరసన వ్యక్తం
చేశారు. తాను రెజ్లింగ్ వదిలేస్తానంటూ ఆమె కన్నీరు పెట్టారు. భజరంగ్ పూనియా కూడా తన
పద్మశ్రీ అవార్డును తిరిగి ఇస్తానంటూ ప్రకటించాడు. సంజయ్ సింగ్ నియామకాన్ని నిరసిస్తూ రెజ్లర్లు
చేపట్టిన ఆందోళనకు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర క్రీడా శాఖ తీసుకున్న
నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.