గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు కొనసాగిస్తోంది. శుక్రవారం అర్థరాత్రి ఐడీఎఫ్ జరిపిన దాడిలో గాజాలో (israel hamas war) ఒకే కుటుంబానికి చెందిన 76 మంది బలయ్యారు. నెలన్నరగా సాగుతోన్న యుద్ధంలో మృతుల సంఖ్య 20 వేలు దాటిపోయింది. గాజాలోని ఓ భారీ భవనంపై ఇజ్రాయెల్ సైన్యం జరిపిన తాజా వైమానిక దాడిలో అల్ ముగ్రాబీ కుటుంబానికి చెందిన వారంతా మృత్యువాతపడ్డారు. వీరిలో 16 మంది పెద్దలతోపాటు మహిళలు, చిన్నారులు ఉన్నారు.
ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం చేస్తోన్న అల్ ముగ్రాబీకి భార్య, ఐదుగురు పిల్లలున్నారు. వారితోపాటు వారి ఉమ్మడి కుటుంబం మొత్తం ఇజ్రాయెల్ దాడిలో బలైంది. నుసైరాత్ వద్ద శరణార్ధుల శిబిరంపై జరిగిన దాడిలో మరో 14 మంది చనిపోయారు. గాజాలోని పలు నగరాలపై గత రాత్రి నుంచి వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇప్పటికే 18 వేల మంది ఉగ్రవాదులను హతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.