Khalistani slogans on Hindu temple in US
అమెరికా
కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఒక హిందూ దేవాలయంలో కొందరు దుండగులు భారత వ్యతిరేక,
ఖలిస్తానీ అనుకూల రాతలు రాసారు. ఆ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
ప్రారంభించారు. ఆ చర్యతో భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని భారత్ ఆవేదన వ్యక్తం
చేసింది.
కాలిఫోర్నియా
రాష్ట్రం నెవార్క్ నగరంలోని స్వామి నారాయణ్ మందిరంలోని పలు గోడలపై కొందరు ఆగంతకులు
భారతదేశానికి, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాసారు.
హిందూ అమెరికన్ ఫౌండేషన్ సంస్థ ఆ
చిత్రాలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అటువంటి రాతల ద్వారా ఆలయాన్ని దర్శించే
ప్రజలను భయపెట్టేందుకు, హిందువుల్లో భయాందోళనలు కలిగించేందుకూ ప్రయత్నిస్తున్నారని
హిందూ అమెరికన్ ఫౌండేషన్ అభిప్రాయపడింది.
ఆ
ఘటనపై నెవార్క్ పోలీస్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సివిల్
రైట్స్ డివిజన్ కేసు నమోదు చేసాయి. ఆ దుశ్చర్యను భారతదేశం తీవ్రంగా ఖండించింది.
వీలైనంత వేగంగా చర్యలు తీసుకోవాలని కోరింది. ‘‘నెవార్క్‌లోని శ్రీ స్వామి నారాయణ్
మందిర్‌లో దుండగుల చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఉదంతం భారత సంతతి వారి
మనోభావాలను దెబ్బతీసింది. ఈ ఘటనపై సత్వరం దర్యాప్తు జరిపించాలని, దుండగులపై కఠిన
చర్యలు తీసుకోవాలనీ సంబంధిత అధికారులను డిమాండ్ చేసాం’’ అని భారత దౌత్య కార్యాలయం ఎక్స్‌లో
ట్వీట్ చేసింది.
అమెరికాలోనూ,
దాని పొరుగునే ఉన్న కెనడాలోనూ హిందూ దేవాలయాలపై దాడులు తరచుగా జరుగుతున్నాయి.
ఖలిస్తాన్ మద్దతుదారులు విదేశాల్లో పాల్పడుతున్న ఇలాంటి దుశ్చర్యలపై భారతదేశం
గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఇతర దేశాల్లో భారత్‌కు వ్యతిరేకంగా వేర్పాటువాదాన్ని
విస్తరింపజేసే ప్రయత్నాలు చేస్తున్న సంస్థలు, వ్యక్తులపై గతంలో కొన్ని చర్యలు
తీసుకుంది.
ఇటీవల
కెనడాలో ఖలిస్తానీ అనుకూలవాదులు రెచ్చిపోతున్నారు. వారికి కెనడా ప్రభుత్వం అండగా
నిలుస్తోంది. పైపెచ్చు భారతదేశంపైనే ఆరోపణలు చేస్తోంది. ఫలితంగా భారత-కెనడా
సంబంధాలు దెబ్బతిన్నాయి.
2024
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీయే
కూటమిని బలహీనపరిచేందుకు, ప్రత్యర్థులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. వాటిలో
ప్రధానంగా ఖలిస్తానీ ఉద్యమకారులు విదేశాల్లో భారత్‌పై రకరకాల దాడులు చేస్తున్నారు.
అందులో భాగంగానే ఇప్పుడు నెవార్క్ ఆలయంలో భారత వ్యతిరేక, మోదీ వ్యతిరేక రాతలు
ప్రత్యక్షమయ్యాయి.