ఎయిర్ ఇండియా కొనుగోలు చేసిన ఎయిర్ బస్ ఏ 350-900 ఢిల్లీ చేరుకుంది. ఇలాంటి విమానం మన దేశంలో వినియోగంలోకి తీసుకురావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. వీటీ ఆర్జీఏ నుంచి ఎయిర్ బస్ ఏ 350 తరహా విమానాలు కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా (air india) ఆర్డర్ పెట్టింది. అందులో భాగంగా మొదటి విమానం అందుకుంది. ఫ్రాన్స్‌లో తయారైన ఈ విమానం ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ చేరుకుంది. విమానాశ్రయ సిబ్బంది నూతన విమానానికి స్వాగతం పలికారు.
ఎయిర్ బస్ ఏ 350 విమానం నడపడంలో కెప్టెన్ మౌనిక బత్రా వైద్యకు ఫ్రాన్స్‌లో శిక్షణ అందించారు. ఎయిర్ బస్ ఏ 350 విమానం రాకతో ఎయిర్ ఇండియా మరింత బలోపేతం అవుతుందని సంస్థ సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ అభిప్రాయపడ్డారు. ఎయిర్ బస్ ఏ 350 ఎయిర్ ఇండియాలో చేరడంతో భారత విమానయానరంగానికి అంతర్జాతీయంగా ప్రతిష్ఠ పెరుగుతుందని ఆయన అన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఇలాంటివి 250 విమానాలు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే బోయింగ్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ రూ.5.6 లక్షల కోట్లు. ఎయిర్ ఇండియా టాటాల చేతిలోకి వెళ్లాక కొత్తపుంతలు తొక్కుతోంది.