ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ దుద్ది ఎమ్మెల్యే రాందులర్ గోండ్‌పై (bjp mla disqualified) అనర్హత వేటు పడింది. తొమ్మిదేళ్ల కిందట ఓ బాలికపై అత్యాచారం కేసులో ఇటీవల రాందులర్ గోండ్‌కు కోర్టు 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ జైలు శిక్ష పడితే చట్ట సభల సభ్యులను అనర్హులుగా ప్రకటిస్తారు. ఆ తరవాత ఆరేళ్లు ఎన్నికల్లో పోటీకి అనర్హులు అవుతారు.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర ప్రజాప్రతినిధుల కోర్టు న్యాయమూర్తి అహ్సన్ ఉల్లాఖాన్ గోండుకు 25 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని బాలిక తల్లికి అందించనున్నారు. 2014లో బాలికపై గోండు అత్యాచారం చేశాడని ఐపీసీ 376, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోస్కో చట్టం కింద కేసు నమోదైంది. అయితే అత్యాచారం చేసిన సమయంలో గోండు ఎమ్మెల్యేగా లేరు. ఆయన భార్య గ్రామ ప్రధాన్‌గా ఉన్నారని బాలిక సోదరుడు త్రిపాఠి తెలిపారు. తరవాత గోండు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో కేసును ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ చేశారు.