Gita Jayanti : Bhagavad Gita is inspiration to the world
కాలాతీతమైన భారతీయ సనాతన సాహిత్యంలో భగవద్గీతకు
(Bhagavad Gita) ప్రత్యేక స్థానం ఉంది. కేవలం భారతదేశానికే
కాకుండా మొత్తం ప్రపంచానికే ప్రేరణగా నిలిచింది. భగవద్గీత అందించిన జ్ఞానంతో, అది
చేసిన మార్గదర్శకత్వంతో ప్రేరణ పొందిన వ్యక్తులు ప్రపంచమంతటా ఉన్నారు. సంస్కృతభాషలో
700 శ్లోకాల్లో రాయబడిన భగవద్గీత మానవాళి మొత్తానికీ ప్రేరణగా నిలుస్తోంది.
ప్రాచీన భారతదేశపు చరిత్ర అయిన మహేతిహాసం
మహాభారతంలో (Maha Bharat) భగవద్గీత ఒక చిన్న భాగం. అందులో మానవ జీవితంలోని
ప్రధాన విషయాలన్నింటినీ సవిస్తరంగా వివరించారు. లక్షా పదివేల శ్లోకాలతో కూడిన
మహాభారతం ప్రపంచ సాహిత్యంలో పేరెన్నిక గన్న ఇలియడ్, ఒడెస్సీలను కలిపినా, వాటి కంటె
ఏడురెట్లు పెద్దది. అలాగే బైబిల్ కంటె మూడురెట్లు పెద్దది. పద్ధెనిమిది పర్వాలుగా
విభజితమైన భారతంలో ఆరవ పర్వంలో పాండవులు, కౌరవుల మధ్య యుద్ధం ప్రారంభం అవడానికి
ముందు పార్ధుడైన అర్జునుడికి పార్ధసారధి అయిన శ్రీకృష్ణుడు చేసిన కర్తవ్యబోధే భగవద్గీత.
భవబంధాల ఉచ్చులో చిక్కుకుపోయి నిర్వీర్యమైపోతున్న అర్జునుడికి (Arjuna and
Krishna), తన కర్మ గురించి, తాను నిర్వర్తించవలసిన విధి గురించి, జీవితపు
వాస్తవికత గురించీ కృష్ణుడు చేసిన వివరణే భగవద్గీత. అందుకే భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి
ప్రేరణగా నిలిచింది. మంచికీ, చెడుకూ మధ్య తేడాను అర్ధం చేసుకుని సరైన మార్గంలో
జీవితం గడపడం ఎలాగో అవగాహన కల్పించే మార్గదర్శి భగవద్గీత. సనాతన ధార్మిక గ్రంథాల
ప్రకారం, విద్వాంసులు చేసిన కాలగణన ప్రకారం 5,159 సంవత్సరాల క్రితం మార్గశీర్ష
శుక్లపక్ష ఏకాదశి నాడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతాజ్ఞానాన్ని బోధించాడు.
భగవద్గీత భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు.
ప్రపంచవ్యాప్తంగా గొప్పగొప్ప శాస్త్రవేత్తలకు, విద్వాంసులకు ప్రేరణ కలిగించింది. మానవుడు
తన జీవితంలో కర్తవ్య నిర్వహణ ఎలా చేయాలో వివరించిన ఉద్గ్రంథంగా నిలిచింది.
భగవద్గీత తమ జీవితాలను సమూలంగా మార్చివేసిందని చెప్పిన మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా
ఎందరో ఉన్నారు. వారిలో కొందరిని తలచుకుందాం.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ (Albert Einstein):
జర్మనీలో పుట్టిన పదార్థభౌతిక శాస్త్రవేత్త. ఆధునిక భౌతికశాస్త్రానికి రెండు
పునాదుల్లో ఒకటైన సాపేక్ష సిద్ధాంతకర్త. విజ్ఞానశాస్త్రపు తాత్వికతపై ఐన్‌స్టీన్
సిద్ధాంతాల ప్రభావం ఎంతగానో ఉంది. ఆయన భగవద్గీత గురించి ఇలా చెప్పాడు, ‘‘భగవంతుడు
ఈ విశ్వాన్ని ఎలా సృష్టించాడో భగవద్గీతలో చదివాక, ఇంక మిగిలినవన్నీ అనవసరంగా,
నిష్ప్రయోజనకరంగా కనిపించసాగాయి.’’ భగవద్గీత
ఐన్‌స్టీన్‌ను ఏ స్థాయి వరకూ ప్రభావితం చేసిందన్నది మనం కనీసం ఊహించలేము.
హెన్రీ డేవిడ్ థారో (Henry David Thoreau):
అమెరికాకు చెందిన ప్రకృతి శాస్త్రవేత్త, వ్యాసకర్త, కవి, తత్వవేత్త, గొప్ప
అతీంద్రియవాది. ప్రకృతి సహజమైన పరిసరాల్లో నిరాడంబరంగా జీవించడం ఎలాగో చెప్పే ఆయన
రచన వాల్డెన్ చాలా ప్రఖ్యాతి గడించింది. ఈ అమెరికన్ కవి మీద భారతీయ తత్వశాస్త్రం, ఆధ్యాత్మిక
భావజాలపు ప్రభావం ఎంతగానో ఉంది. తన ప్రముఖ రచన ‘వాల్డెన్’లో ఆయన భగవద్గీతను పలుమార్లు
ఉటంకించాడు. ‘‘ప్రాచ్య ప్రపంచపు శిథిలాలు అన్నిటికంటె ఈ భగవద్గీత ఎంతో గొప్పది’’
అన్నాడాయన.
జె రాబర్ట్ ఓపన్హైమర్ (J Robert
Oppenheimer) : ఈయన అమెరికాకు చెందిన పదార్ధ
భౌతికశాస్త్రవేత్త. అణుబాంబు పితామహుడిగా పేరు గడించాడు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో
జపాన్‌కు చెందిన హిరోషిమా, నాగసాకీ నగరాలపై అమెరికా అణుబాంబు ప్రయోగించడంలో ఈయన
ప్రమేయం కీలకమైనది. మొట్టమొదటి అణుబాంబు ప్రయోగం జరుగుతూ ఉన్నప్పుడు, కృష్ణుడు
అర్జునుడికి తన విధి తాను నిర్వర్తించాలని చేసే హితబోధను ఓపన్హైమర్ గుర్తు చేసుకున్నాడు.
‘‘నేనే మృత్యువునై ఉన్నాను, ప్రపంచాన్ని నాశనం చేసేవాడిని నేనే’’ అన్న
కృష్ణవాక్యాన్ని పలికాడు. ఆ విషయాన్ని వేరొక సందర్భంలో ప్రస్తావిస్తూ తన జీవన తాత్వికతను
తీర్చిదిద్దిన ప్రభావశీల గ్రంథాల్లో భగవద్గీత
ప్రధానమైనదని ఆయన చెప్పాడు.
సునీతా విలియమ్స్ (Sunita Williams) :
అమెరికాకు చెందిన వ్యోమగామి, అమెరికన్ నౌకాదళంలో అధికారిణి. భారతీయ మూలాలు కలిగిన
సునీత, అంతరిక్షంలో సుదీర్ఘం స్పేస్‌వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించింది.
అంతర్జాతీయ రోదసీ కేంద్రం (ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్)లోకి వెళ్ళేటప్పుడు ఆమె
తనతో గణపతి విగ్రహాన్నీ, భగవద్గీత పుస్తకాన్నీ తీసుకువెళ్ళింది. ‘‘అవి మన జీవితాలను
ప్రతిఫలించే ఆధ్యాత్మిక విషయాలు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ మనను కూడా మరోవిధంగా
చూపించే గ్రంథం భగవద్గీత. అందుకే అంతరిక్షంలోకి వాటిని తీసుకువెళ్ళడం సరైనదిగా
భావించాను’’ అని చెప్పింది. తను చేసే పని గురించి, తను ఆ పని చేయడానికి కారణం
గురించి తెలుసుకోడానికి భగవద్గీత ఎంతగానో తోడ్పడిందని సునీత వివరించింది. తన
జీవితం ప్రయోజనం ఏమిటో స్పష్టంగా తెలుసుకోడంలో భగవద్గీత సహకరించిందని సునీత
వెల్లడించింది.
రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ (Ralph Waldo
Emerson) : అమెరికన్ రచయిత, అధ్యాపకుడు, తత్వవేత్త, కవి. 19వ శతాబ్దంలో అతీంద్రియ
ధ్యాన మార్గం గురించి అమెరికాలో ప్రచారం చేసిన ప్రముఖుడు. వ్యక్తివాదాన్ని ప్రోత్సహించిన
తత్వవేత్త. అమెరికాలో 1500కు పైగా ప్రసంగాలు చేసిన రచయిత. ఫ్రెంచ్ తత్వవేత్త
విక్టర్ కజిన్ రచనల ద్వారా ఎమర్సన్‌కు భారతీయ తత్వశాస్త్రం పరిచయం అయింది.
భగవద్గీత గురించి ఎమర్సన్ ఇలా అన్నాడు, ‘‘నేను భగవద్గీతకు ఋణపడిపోయాను. గీతను
చదవడమంటే ఒక సామ్రాజ్యం మనతో మాట్లాడినట్లే. ఉత్కృష్టమైన, ప్రశాంతమైన, స్థిరమైన
ప్రాచీన జ్ఞానపు స్వరం మరో యుగంలో, మరో వాతావరణంలో సంధించిన ప్రశ్నలు, చేసిన
ఆలోచనలూ రాబట్టిన జవాబులు ఇవాళ మనం చేసే ఆలోచనలు, మనం ప్రశ్నించుకునే ప్రశ్నలకు
ఇప్పటికీ సమకాలీనంగానే ఉండడం భగవద్గీత గొప్పదనం.’’
అనీ బిసెంట్ (Annie Besant) :
బ్రిటిష్ సామ్యవాది, దివ్యజ్ఞాని, మహిళాహక్కుల కార్యకర్త, రచయిత్రి, వక్త,
విద్యావేత్త, దాతృత్వశీలి. భారతీయ తత్వశాస్త్ర అధ్యయనంలో ఆమెకు అపారమైన అభిరుచి
ఉంది. భగవద్గీతను ఆవిడ ‘ది లార్డ్స్ సాంగ్’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించింది.
అందులో ఆమె ఇలా రాసింది ‘‘ఆధ్యాత్మికంగా ఉండే వ్యక్తి ఏకాంతవాసం చేసే సన్యాసో,
తపస్వో కానవసరం లేదు. ప్రాపంచిక వ్యవహారాల్లో ఉంటూనే ఆధ్యాత్మిక జీవితాన్ని
సాధించవచ్చు. భగవంతుణ్ణి చేరుకోడంలో అడ్డంకులు బైట ఉండవు, మన లోపలే ఉంటాయి. అదే
భగవద్గీత సారాంశం.’’
ఫిలిప్ గ్లాస్ (Philip Glass) :
అమెరికన్ సంగీత కళాకారుడు, పియానో వాదకుడు. 20వ శతాబ్దపు చివరిదశలో అత్యంత
ప్రభావశీలి అయిన సంగీతవేత్త. ఆయన తన స్వరసృజనలో భగవద్గీతను ఉటంకించాడు. గ్లాస్, గాంధీ
జీవితం ఆధారంగా ‘సత్యాగ్రహ’ అనే ఒక రూపకానికి రూపకల్పన చేసాడు. అందులో భగవద్గీత
శ్లోకాలను యథాతథంగా సంస్కృతంలో గానం చేసారు. అదొక విచిత్రమైన, సంప్రదాయభిన్నమైన
సంగీత రూపకం. అందులో గాయకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. కేవలం భగవద్గీత శ్లోకాలను
మాత్రం గానం చేస్తుంటారు. ప్రేక్షకులు కేవలం భగవద్గీత శ్లోకాలను ఒక తెర మీద
చూస్తుంటారు తప్ప వాటి అనువాదం అక్కడ ఉండదు. అలా, రూపకం మొత్తం భగవద్గీత
శ్లోకాలతోనే ఉండడం ఒక విశేషం.