సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు షార్ ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1 (aditya L1) ఉపగ్రహం జనవరి 6 నాటికి గమ్యం చేరనుంది. జనవరి 6వ తేదీకి ఆదిత్య ఎల్ 1 అనుకున్న లక్ష్యానికి చేరుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. జనవరి 6న ఆదిత్య ఎల్ 1 లగ్రాంజ్ పాయింట్ 1లోకి చేరుతుందని ఆయన తెలిపారు. సరైన సమయంలో మరిన్ని వివరాలు అందిస్తామన్నారు. ఎల్ 1 పాయింట్‌కు చేరుకున్న తరవాత మరో ఇంజిన్‌ను మండించనున్నట్లు సోమనాథ్ తెలిపారు.
జనవరి 6న ఆదిత్య ఎల్ 1 గమ్య స్థానం చేరి అక్కడ స్థిరపడుతుందని ఇస్రో ఛైర్మన్ ప్రకటించారు. ఆ తరవాత స్థిర కక్ష్యలో తిరుగుతుందన్నారు. ఐదు సంవత్సరాలపాటు ఈ ఉపగ్రహం నుంచి సమాచారం అందుతుందన్నారు. సూర్యుడిలో వచ్చే మార్పులు, మానవ శరీరంపై ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి సమాచారం ఉపకరిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్పేస్ స్టేషన్ నిర్మించేందుకు ఇస్రో ప్రణాళికలు సిద్దం చేస్తోందని సోమనాథ్ గుర్తుచేశారు.
సూర్యుడి చుట్టూ వాతావరణం అంచనా వేయడం ఆదిత్య ఎల్ 1 లక్ష్యం. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలోని లగ్రాంజ్ పాయింట్ 1కు ఉపగ్రహం చేరుకున్న తరవాత సమాచారం పంపడం మొదలు పెడుతుంది. ఈ ఏడాది సెప్టెంబరు 2న ఆదిత్య ఎల్ 1 ప్రయోగించిన విషయం తెలిసిందే.