grain portrait of Ram
and Sita. అయోధ్య లో రామమందిరం ప్రారంభోత్సవానికి
అంకురార్పణగా భారత్ తో పాటు విదేశాల్లోనూ
పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి. పొరుగు దేశమైన నేపాల్ లోనూ సుగుణాభిరాముడి
భక్తులు కోకొల్లలు. ధాన్యాలతో శ్రీసీతారాములను చిత్రీకరించి తమ భక్తిని
ప్రదర్శించడంతో పాటు ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారు.
నేపాల్ లోని జనకపూర్ లో
భారత్, నేపాల్ కు చెందిన పదిమంది కళాకారులు సీతారాముల చిత్రాన్ని అద్భుతంగా
తీర్చిదిద్ది ఆదర్శ దంపతులపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.
రంగభూమి
మైదానంలోని 11వేల చదరపు అడుగుల్లో సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని ఓ కళాఖండం ద్వారా
ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు.
ఆద్మాత్మిక కళాఖండం తయారీకి 101 క్వింటాళ్ళ 11
రకాల ధాన్యాలను వినియోగించారు. 120 అడుగుల పొడవు, 91.5 అడుగుల వెడల్పుతో 11 రకాల
ధాన్యాలు ఉపయోగించి శ్రీరాముడి కళ్యాణఘట్టాన్ని తెలిపే చిత్రాన్ని రూపొందించారు. సీతమ్మ
తండ్రి జనకమహారాజుతో పాటు శ్రీరాముడి గురువు విశ్వామిత్రుడిని కూడా అత్యంత అద్భుతంగా
తీర్చిదిద్దడం ద్వారా చిత్రకారుల అంకిత భావం, రామచంద్రస్వామి పట్ల భక్తిప్రపత్తులు
ప్రస్ఫుటమయ్యాయి.
భారత్
కు చెందిన సతీశ్ గుజ్జర్ అనే చిత్రకారుడు ఈ కళాఖండాన్ని రూపొందించడంలో కీలకపాత్ర
పోషించాడు. వివాహపంచమి వేడుక ప్రారంభం రోజును దీనికి అంకురార్పణ చేశారు. రాములోరు,
సీతమ్మ వివాహం జరిగిన ఈ పవిత్రప్రదేశం జనకపూర్ కేంద్రంగా ఈ వేడుకను స్థానికులు
రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.
గతంలో
ఇలాంటి చిత్రాన్నే సతీశ్ గుజ్జర్ రూపొందించారు. అయోధ్యలో 10,800 చదరపు అడుగుల్లో
సీతారాముల చిత్రాన్ని ధాన్యంతో రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. ఎలాంటి రసాయనాలు
వాడకుండా కేవలం సంప్రదాయ పద్ధతుల్లోనే దీనిని చిత్రీకరించడం విశేషం.
ఇరుదేశాల
చిత్రకారులు అనేక వారాల పాటు శ్రమించి తీర్చిదిద్దిన శ్రీసీతారాముల కళ్యాణ ఘట్ట
చిత్రాన్ని వీక్షించేందుకు అనేక మంది రంగభూమి మైదానానికి తరలివస్తున్నారు. ఎంతో
ఆకర్షణీయంగా ఉన్న చిత్రాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత్-నేపాల్
ఆద్మాత్మిక వారసత్వ సంబంధాలను మరింత పరిపుష్టం చేయడంలో ఇలాంటి కళాకృతుల పాత్ర
ఎనలేనిదని పలువురు కొనియాడుతున్నారు.
సంస్కృతి,
మత సంప్రదాయల విషయంలో భారత్-నేపాల్ మధ్య ఎన్నో సారూప్యతలు ఉన్నాయని వాటిని ఈ తరహా
కళాత్మక ప్రదర్శనలు మరింత బలోపేతం చేస్తాయని ఆకాంక్షించారు.
వివాహ
పంచమి పేరిట సీతారాములు వివాహ వార్షికోత్సవాన్ని ఏడురోజుల పాటు జనకపూర్ ధామ్ లో
ఘనంగా చేసుకుంటారు. మార్గశిర శుక్ల పంచమి నాడు 5 వేల ఏళ్ళ కిందట రాములవారి వివాహం జరిగింది.
ఈ పవిత్ర ఉత్సవాల్లో భారత్, నేపాల్ కు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.