వంట నూనెల ధరలు మరింత దిగిరానున్నాయి. ఇప్పటికే వంట నూనెల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం సుంకం తగ్గించింది. ఈ తగ్గింపు 2024 మార్చితో ముగియనుంది. తాజాగా తగ్గింపును 2025 మార్చి చివరి వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. రిఫైన్డ్ సోయాబీన్ నూనె, రిఫైన్డ్ సన్‌ప్లవర్ నూనెలపై బేసిక్ సుంకాన్ని 17.5 శాతం నుంచి
12.5 శాతానికి తగ్గించింది. దిగుమతి సుంకం తగ్గింపుతో దేశంలో వంట నూనెల ధరలు (edible oils) ఇప్పటికే దిగి వచ్చాయి. ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద వంటనూనెల దిగుమతి చేసుకుంటోన్న దేశంగా ఉంది. మొత్తం వంట నూనె అవసరాల్లో భారత్ 60 శాతం దిగుమతి చేసుకుంటోంది.
మసూర్ దాల్ అంటే ఎర్ర కంది పప్పుపై కూడా దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం సున్నాకు తగ్గించింది. 2025 మార్చి వరకు తగ్గింపు వర్తిస్తుంది. ఎర్ర కందిపప్పు దిగుమతులపై 10 శాతం వ్యవసాయ సుంకాన్ని కూడా మినహాయింపు కల్పించారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి భారీగా ఎర్ర కంది పప్పు దిగుమతి చేసుకునేందుకు వ్యాపారులకు వెసులుబాటు కల్పించారు. 2021 జులైలోనే ఎర్రకంది పప్పుపై సుంకాన్ని జీరోకు తగ్గించారు.