తెలుగు
రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు శ్రీహరి నామస్మరణతో మార్మోగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి
కావడంతో తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారిని
ఉత్తరద్వారం నుంచి దర్శించుకుని తరిస్తున్నారు.
ధనుర్మాసంలో
వచ్చే శుక్ల ఏకాదశినే వైకుంఠ, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఆరోజు శ్రీమహావిష్ణువును
భక్తిశ్రద్ధలతో పూజించి దేవదేవుడి కరుణా కటాక్షాలు పొందుతారు. వైకుంఠం ఉత్తర వైపున
ఉంటుంది కనుక ఈ రోజున వాసుదేవుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం అనవాయితీగా
వస్తోంది.
నేడు
తిరుమలేశుడికి ప్రత్యేక అలంకరణ చేస్తారు, భద్రాద్రి రాములోరికి రాత్రికి గోదావరిలో
తెప్పోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు. యాదాద్రి క్షేత్రంలో లక్ష్మీనారసింహ
స్వామి గరుడ వాహనంపై నుంచి వైకుంఠనాథుడిగా సాక్షాత్కరిస్తున్నారు.
తిరుమల
శ్రీవేంకటేశ్వరస్వామి, భద్రాచలం రామయ్య, యాదాద్రి లక్ష్మీనారసింహస్వామిని
దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. గోవిందుడి
నామస్మరణతో ఆయా ప్రాంతాలు పరమపవిత్రంగా శోభిల్లుతున్నాయి. రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు
ఆయా ఆలయాల్లో స్వామిని దర్శించుకున్నారు.
కోనసీమలోని
వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనాని పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విజయవాడ టీటీడీ కళ్యాణమండపం లోని వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
కొత్తూరు
తాడేపల్లిలోని శ్రీ పంచముఖ వీరాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విష్ణు
సహస్రనామ పారాయణ, వేద పారాయణ నిర్వహించారు. దేవుని కడప
శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై నుంచి
భక్తులను శ్రీహరి కటాక్షిస్తున్నారు.
కాశీ
విశ్వేశ్వరుని క్షేత్రంలో గంగానది తీరాన మానస సరోవరం ఘాట్ వద్ద ఉన్న శ్రీ
రామతారకాంధ్ర ఆశ్రమంలో ఉన్న శ్రీ రామాలయంలో వైకుంఠ ద్వారం దర్శనం కనులపండుగగా
నిర్వహించారు.
టీడీపీ
అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉండవల్లిలోని తన నివాసంలో మూడు
రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నాడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించగా, మూడు
రోజుల పాటు జరిగే శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ది నిర్వహిస్తున్నారు.
గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల
పర్యవేక్షణలో 40 మంది రిత్వికులు యాగం నిర్వహించారు.