కరోనా మహమ్మారి(Covid-19) కేరళతో
పాటు దేశాన్ని మళ్ళీ కలవరపెడుతోంది. కేరళలో ఒక్క రోజులో 265 కేసులు నమోదు కావడంతో
పాటు ఈ రాకాసి వైరస్ కారణంగా ఒకరు మృతి చెందడం కలకలం రేపుతోంది.
దేశంలో ప్రస్తుతం
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,997గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ
వెల్లడించింది.
గురువారం నాడు దేశవ్యాప్తంగా 594 మందికి కోవిడ్
పాజిటివ్ నిర్ధారణ కాగా, దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 2,311 నుంచి 2,669కి చేరింది.
కరోనా కేసుల పెరుగుదల పై స్పందించిన ప్రపంచ
ఆరోగ్య సంస్థ మాజీ ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, ప్రజలు ఆందోళన
చెందాల్సిన అవసరం లేదన్నారు.
కనీస జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యాప్తికి
అడ్డుకట్ట వేయాలని సూచించారు. JN.1 అనే వేరియంట్ ప్రమాదకరమని గాని,
దాని ద్వారా నిమోనియా కేసుల వ్యాప్తి పెరుగుతుందని పరిశోధనల్లో తేలలేదన్నారు. అలాగే
మరణాల రేటు అధికంగా ఉంటుందనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.
వైరస్ వ్యాప్తి పట్ల భయాందోళనకు గురి కావాల్సిన
అవసరం లేనప్పటికీ మహమ్మారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఒమిక్రాన్ ఒకటిరెండు ఉత్పరివర్తనాలకు లోనై జేఎన్1
ఏర్పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. గాలి సరిగా ప్రసరించని గదుల్లో ఉండకుండా మాస్క్
లేకుండా ఉన్న వ్యక్తులతో ఎక్కువ సమయం గడపవద్దు అని సూచించారు. దీర్ఘకాలిక వ్యాధులు
ఉన్న వారు వైరస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.