పార్లమెంటు
నుంచి విపక్షాలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండీ కూటిమి
పార్టీల నేతలు నిరసన వ్యక్తం చేశారు. దిల్లీలోని జంతర్‌మంతర్‌లో ‘సేవ్ డెమక్రసీ’
పేరిట కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున
ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎం) జాతీయ
ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పాల్గొని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా
నినాదాలు చేశారు.
పార్లమెంటు
శీతాకాల సమావేశాల సందర్భంగా ఉభయ సభల నుంచి 146 మంది సభ్యులను సస్పెండ్ చేయడం,
తర్వాత సభలను నిరవధికంగా వాయిదా వేయడాన్ని తప్పుబట్టారు.
ప్రజాస్వామ్య
పరిరక్షణ కోసం ఏం చేసేందుకైనా విపక్షాలు సిద్ధంగా ఉన్నాయని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్
అన్నారు.
పార్లమెంటులో జరిగిన ఘటన దేశ భవిష్యత్ కు మంచిది కాదనే అభిప్రాయాన్ని ఈ
నిరసన ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళగల్గామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.
ప్రజాస్వామ్యం
ప్రమాదంలో పడిందనే విషయాన్ని ప్రజలు అర్థం
చేసుకుని ఎన్డీయేను గద్దె దించి ఇండీకూటమికి అధికారం ఇవ్వడం ద్వారానే దేశ భవిష్యత్
బాగుంటుదన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం పార్లమెంటు చరిత్రలో మొదటిసారి అన్నారు.
పార్లమెంటులో
భద్రతా వైఫల్యంపై కేంద్రప్రభుత్వం ప్రకటన చేయాలంటూ విపక్షసభ్యులు, ఉభయ సభల్లోనూ
పట్టుబట్టారు. ఘటన పై విచారణ బాధ్యత తనదేనంటూ స్పీకర్ ప్రకటించినా బేఖాతరు చేస్తూ
సభా కార్యక్రమాలకు అంతరాయం కల్పించారు. వెల్ లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు.
స్పీకర్ ఎంత చెప్పినా విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా
సెషన్ ముగిసే వరకు సస్పెండ్ చేశారు.
లోక్‌సభ
నుంచి 100 మంది సభ్యులు సస్పెండ్ కాగా, రాజ్యసభలోనూ ఇదే తతంగం నడిచింది. 46 మంది
రాజ్యసభ సభ్యులను సభ నుంచి శీతాకాల సమావేశాలు ముగిసే వరకు బహిష్కరించారు.
రాజ్యసభ 262వ సెషన్ ముగింపు సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి
జగదీప్ ధన్‌ఖఢ్, కొంత మంది సభ్యులు సృష్టించిన
గందరగోళం కారణంగా 22 గంటల పెద్దల సభ సమయం వృధా అయిందని ఆవేదన చెందారు.