No religious discrimination
in Indian society, says Modi
భారతదేశంలో ఏ మైనారిటీ మతం పట్లా వివక్ష
లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఇంగ్లండ్‌కు చెందిన ఫైనాన్షియల్
టైమ్స్ పత్రిక ఇంటర్వ్యూలో భారతదేశంలో ముస్లిముల భవిష్యత్తు గురించి అడిగిన
ప్రశ్నకు ఆయన స్పందించారు. తాను ప్రధానమంత్రి అయిన 2014 నుంచీ దేశంలో ఇస్లామిక్
వ్యతిరేక సెంటిమెంట్లు, ద్వేషప్రసంగాలూ పెరిగాయని దేశీ-విదేశీ విమర్శకులు
నిరంతరాయంగా చేస్తున్న విమర్శలను మోదీ కొట్టిపడేసారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని
ఇతరదేశాల కంటె వేగంగా ఎదుగుతోందని ఆయన గుర్తు చేసారు.
‘‘భారతీయ సమాజంలోనే ఏ మైనారిటీ మతం పట్లా
ఎలాంటి వివక్షా లేదు’’ అని మోదీ స్పష్టం చేసారు. భారతదేశంలో నివసిస్తున్న అతిచిన్న
మతపరమైన మైనారిటీలైన పార్సీలు ఆర్థికరంగంలో సాధించిన, సాధిస్తున్న విజయాలను మోదీ
కొనియాడారు.
‘‘ప్రపంచంలోని మిగతా దేశాల్లో అంతులేని
పీడనను ఎదుర్కొన్న పార్సీలు భారతదేశంలో సురక్షితమైన, భద్రమైన వాతావరణాన్ని
కనుగొన్నారు. వారిక్కడ సుఖంగా సంతోషంగా జీవిస్తున్నారు. దేశాభివృద్ధికి
తోడ్పడుతున్నారు’’ అని మోదీ గుర్తుచేసారు. నేరుగా ప్రస్తావించకపోయినా, దేశంలోని
సుమారు 20 కోట్ల మంది ముస్లిములూ కూడా అలాంటి సురక్షితమైన, భద్రమైన వాతావరణంలో
జీవిస్తున్నారని అర్ధమయ్యేలా మోదీ పరోక్షంగా చెప్పారు.
మోదీ ఈ యేడాది జూన్‌లో అమెరికా
వెళ్ళినప్పుడు కూడా దాదాపు ఇవే మాటలు చెప్పారు. అప్పుడాయన ‘‘భారతదేశంలో ఏ కులం,
మతం వర్గం, జాతి, జెండర్‌కు చెందినవారిపైన అయినా వివక్ష చూపడానికి అవకాశం లేదు’’ అని వివరించారు.
విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అయితే ఇంకో రెండాకులు ఎక్కువే తిన్నారు. అమెరికాలో ఓ
సందర్భంలో మాట్లాడుతూ భారతదేశంలోమతపరమైన వివక్ష ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. నిజానికి
గతంలోకంటె ఇప్పుడే పరిస్థితి బాగుందన్నారు.
ప్రభుత్వ విమర్శకులపై దాడులు
చేయిస్తున్నారన్న ఆరోపణల గురించి అడిగినప్పుడు మోదీ బిగ్గరగా నవ్వేసారు. ‘‘మా
దేశంలో ఉన్న స్వాతంత్ర్యాన్ని వాడుకుని మామీద ప్రతీ రోజూ దుష్ప్రచారం చేయడానికి
ఏకంగా ఒక పెద్ద వ్యవస్థే నడుస్తోంది. పత్రికల్లో సంపాదకీయాలు, టీవీ ఛానెళ్ళలో చర్చలు, సామాజిక మాధ్యమాల్లో
వ్యాఖ్యానాలు, వీడియోల ద్వారా మామీద పుష్కలంగా బురద జల్లుతున్నారు’’ అని చెప్పారు.
‘‘వాళ్ళకు అలా చేయడానికి హక్కుంది. అదే సమయంలో ఆ ప్రచారాన్ని నిజాలతో ఎదుర్కోడానికి
ఎదుటివారికి కూడా సమానమైన హక్కు ఉంది’’ అని వివరించారు.
మోదీ ప్రభుత్వం భారతదేశపు ప్రజాస్వామిక,
లౌకిక సంప్రదాయాలను విచ్ఛిన్నం చేస్తోందన్న ఆరోపణలను సైతం మోదీ ఖండించారు. ‘‘మీరు ప్రస్తావించిన
విషయాలు నిజంగా అంత దారుణంగా ఉండి ఉంటే భారతదేశం ప్రపంచంలోనే వేగంగా ఎదుగుతున్న
ఆర్థిక వ్యవస్థ స్థాయిని సాధించేది కాదన్న నిజాన్ని గుర్తించడం చాలా అవసరం’’ అని
స్పష్టం చేసారు.
‘‘మా విమర్శకులు తమవైన
అభిప్రాయాలు ఏర్పరచుకోవచ్చు. వాటిని వ్యక్తీకరించే స్వేచ్ఛ కూడా వారికి ఉంది. కానీ
విమర్శల రూపంలో చేసే అలాంటి ఆరోపణలతో ఒక చిక్కు ఉంది. అలాంటి ఆరోపణలు భారతీయ ప్రజల
ఆలోచనా శక్తిని అవమానిస్తుంటాయి. అంతేకాదు, ప్రజాస్వామ్యం, వైవిధ్యం వంటి విలువల
పట్ల భారతీయుల ప్రగాఢ నిష్ఠను తక్కువ అంచనా వేస్తుంటాయి’’ అని వివరించారు.