శాసనసభ
ఎన్నికల నిర్వహణ కసరత్తులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఎన్నికల సంఘం
పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఏడుగురు అధికారుల
బృందం, విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష
నిర్వహిస్తోంది.
రాష్ట్ర అసెంబ్లీ గడువు జూన్ 16 తో ముగియనుండటంతో సార్వత్రిక
ఎన్నికల సన్నద్ధత, జిల్లాల వారీగా ఓటర్ల జాబితా తయారీ పై నివేదికల ఆధారంగా సమీక్షిస్తున్నారు.
ఓటర్ల
జాబితాలో అక్రమాలు, లోపాలపై ప్రతిపక్షాలు అందజేసిన ఫిర్యాదులపై తీసుకున్నచర్యలపై
కూడా జిల్లా ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల
సన్నద్ధత గురించి ఒక్కో జిల్లా కలెక్టర్ 15 నిమిషాలు పాటు ఈసీ బృందానికి వివరణ
ఇస్తారు.
నేడు 18 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఎన్నికల సన్నద్ధతపై నివేదిక
అందజేయనున్నారు. మిగలిన వారు రేపు అందజేస్తారు.
కేంద్ర
ఎన్నికల సంఘం బృందంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంధ్ర శర్మ, నితీశ్
కుమార్ వ్యాస్, ఆర్కే గుప్తా, హిర్దేశ్ కుమార్, అజయ్ బాదో ఉన్నారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు
జరగబోతున్న ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాలపై ఈసీ ఫోకస్
పెట్టింది.
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారుల
బదిలీలపై కీలక ఆదేశాలు జారీ చేసిన సీఈసీ సొంత జిల్లాల్లో పనిచేస్తున్న అధికారులను
ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని పేర్కొంది.
ఒకే చోట మూడేళ్ళ కంటే ఎక్కువ కాలం పనిచేస్తున్న
అధికారులను తక్షణమే బదిలీచేయాలని రాష్ట్రాలను ఆదేశించింది.
పోలీసులతో
పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులందరికీ ఈ నియమాలు వర్తిస్తాయని కేంద్ర
ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది.