తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు (tirumala tirupati) పోటెత్తారు. శుక్రవారం పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతిస్తున్నారు. శనివారం వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలకు భారీగా భక్తులు చేరుకుంటున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి షెడ్లు కూడా నిండిపోయాయి. క్యూలైను నారాయణగిరి అతిథి గృహం వరకు చేరుకుంది. వైకుంఠ ద్వార దర్శనానికి రేపు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో, టోకెన్లు లేని వారిని దర్శనానికి అనుమతించడం లేదు. రేపటి సర్వదర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే క్యూ లైన్లలోని అనుమతిస్తున్నారు.
వైకుంఠ ఏకాదశికి టోకెన్లు లేకపోయినా భక్తులను అనుమతిస్తామని ముందుగా టీటీడీ ప్రకటించింది. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో నిర్ణయం మార్చుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో, వారికి సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. గురువారం రాత్రి నుంచే వైకుంఠ దర్శనానికి టికెట్లు జారీ చేస్తున్నారు. వైకుంఠ ఏదాదశి దర్శనానికి ప్రత్యేక టికెట్లు ముద్రించారు. ఇప్పటికే వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారి దర్శనం కోసం రూ.300 టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు.